రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎబౌ యావరేజ్, హిట్, సూపర్ హిట్.. అనే టాక్ తొలుత వచ్చినా, అంతకన్నా ఎక్కువగా సినిమాపై దుష్ప్రచారం జరిగింది.
ఇటీవలి కాలంలో ఏ సినిమాకైనా ఈ నెగెటివిటీ తప్పడంలేదు. సోషల్ మీడియా వేదికగా, తప్పుడు ట్వీట్లు, అడ్డగోలు రివ్యూలు.. ఇవన్నీ మామూలే అయిపోయాయ్ ప్రతి సినిమా విషయంలోనూ. పెయిడ్ రివ్యూలు, సినిమాలపై విషం చిమ్ముతుండడం ఈ మధ్య ఎక్కువగానే చూస్తున్నాం.
‘గేమ్ ఛేంజర్’ విషయానికొస్తే, ఓ కార్పొరేట్ మాఫియా తరహాలో, సినిమాపై నెగెటివిటీ పక్కాగా ప్లాన్ చేసి మరీ, ప్రచారం చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ‘వేలంపాట’ అంశం ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
సినిమాని తొలి రోజే, మొదటి షో అనంతరమే హెచ్‌డీ క్వాలిటీతో పైరసీ చేయడం దగ్గర్నుంచి, వాటిని సోషల్ మీడియాలో తిప్పడం వరకు.. వివిధ విభాగాల్లో వేలంపాట నిర్వహించి, చెల్లింపులు జరిపారట.
జనసేన పార్టీ అంటే గిట్టని ఓ ప్రధాన రాజకీయ పార్టీ కనుసన్నల్లో ఓ బలమైన నెట్‌వర్క్ మాఫియాగా ఏర్పడి, ఓ తరహా నెగెటివిటీని, పైరసీ వ్యవహారాన్ని నడిపితే, కుల జాడ్యం ఇంకో వైపు నుంచి ‘గేమ్ ఛేంజర్’ సినిమా మీద దాడి చేసింది.
ఈ మొత్తం వ్యవహారంలో కొందరు స్టార్ హీరోల అభిమాన సంఘాలు కూడా తెరవెనుక చేతులు కలపడం మరింత విస్మయం కలిగించే అంశం. ఎట్టి పరిస్థితుల్లోనూ రివ్యూల రేటింగ్ రెండున్నర దాటకూడదన్న కోణంలో ఒప్పందాలు జరగడం, ఈ క్రమంలో లక్షలు చేతులు మారడం జరిగిందిట.
ఓ రివ్యూ కోసం ఐదు లక్షల పైనే ఖర్చు చేశారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా పాజిటివ్ రివ్యూ కోసం చెల్లింపులు మామూలే. చిత్రంగా, నెగెటివిటీ కోసం ఈసారి తక్కువ రేటింగ్ కోరుతూ రివ్యూలు రాయించుకున్నారు.. డబ్బులు చెల్లించి మరీ.
సినిమా పైరసీ బారిన పడినా, నిర్మాత దిల్ రాజు ఇప్పటివరకూ పెదవి విప్పకపోవడం, సినిమాపై జరిగిన కుట్రపూరిత నెగెటివిటీ.. వీటన్నిటిపట్లా మెగాభిమానులైతే గుస్సా అవుతున్నారు. పైరసీకి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ నుంచి లీకులు అయితే వస్తున్నాయ్.
ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్.. ఇలా సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేసినందుకు పెద్ద హ్యాండిల్స్, ఓ మోస్తరు హ్యాండిల్స్ మాత్రమే కాదు.. చిన్న చిన్న హ్యాండిల్స్ కూడా బాగానే లాభపడ్డాయట.
‘వేలంపాట’ తరహాలో పెద్ద మొత్తంలో ఖర్చు చేసి ‘గేమ్ ఛేంజర్’ సినిమా మీద ఇంతలా నెగెటివిటీ క్రియేట్ చేయాల్సిన అవసరమేమొచ్చింది.? ఎవరికి ఆ అవసరం వుంది.? ఆ గోతికాడి నక్కలెవరు.? ఇవేమీ మిలియన్ డాలర్ క్వశ్చన్స్ కాదు.! కాకపోతే, తమ సినిమా నష్టపోయింది గనుక.. ఆ గుంట నక్కల జాతకాల్ని బయటపెట్టాల్సిన బాధ్యత చిత్ర నిర్మాణ సంస్థ మీదనే వుంది.