అసెంబ్లీ సమావేశాలు అంటే, బూతులే.. ఒకప్పుడు.! ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూడ ముచ్చటగా వుంటున్నాయ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల గురించి ప్రస్తావన వస్తోంటే, ఇంటిల్లిపాదీ ప్రత్యక్ష ప్రసారాల్ని ఆసక్తికరంగా తిలకరిస్తున్నారు.
ఇంకోపక్క, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో క్షణం తీరిక లేకుండా వున్న ప్రజా ప్రతినిథుల కోసం క్రీడల పోటీలను నిర్వహిస్తే, వాటి గురించి కూడా జనం ఆసక్తిగా చర్చించుకున్నారు.
తాజాగా, మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. పలనాటి బాల చంద్రుడిగా మంత్రి కందుల దుర్గేష్ అభినయం అందర్నీ ఆకట్టుకుంది. అలాగే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కట్టిన పౌరాణిక వేషానికి జనం నుంచి మంచి స్పందన లభించింది.
నిన్న జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఈ సందర్భంగా ప్రజా ప్రతినిథులు ఆనందోత్సాహాల నడుమ.. ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయడం, ఇదంతా కన్నుల విందుగా వుందని జనం అంటున్నారు.
సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వేదికపై ఏదో ఒక మ్యాజిక్ చేసి వుంటే బావుండేదనీ, మరో సినీ నటుడు బాలకృష్ణ వేదికపై ఏదన్నా స్కిట్ చేసి వుండాల్సిందనీ జనం అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా వుంటే, ఈ సాంస్కృతిక కార్యక్రమాలపై వైసీపీ, తనదైన పద్ధతిలో దుష్ప్రచారం షురూ చేసింది. సహజంగానే, ఈ దుష్ప్రచారానికి జనం నుంచే ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. ప్రజా ప్రతినిథులు కళల పట్ల తమ ఇష్టాన్ని ఈ వేదిక ద్వారా ప్రదర్శిస్తే, అభినందించాల్సింది పోయి.. ఇదేం పైత్యం.? అంటూ వైసీపీపై మండిపడుతున్నారు.
గతంలో ఎప్పుడూ అసెంబ్లీ సమావేశాలు ఇంత జన రంజకంగా, ఇంత పారదర్శకంగా జరగలేదనీ, చట్ట సభలంటే బూతులన్న భావన నుంచి, ఇప్పుడిప్పుడే చట్ట సభలకు గౌరవం పెరుగుతోందని ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై యువత నుంచి సానుకూల స్పందన కనిపిస్తోంది.