ట్రూడౌన్.. అంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధానం. ఇది గత ఐదేళ్లలో ఎన్నడూ వినిపించలేదు. ఎంత సేపు ట్రూ అప్ మాత్రమే వినిపించింది. ట్రూ అప్ అంటే విద్యుత్ ఛార్జీలు పెంచడమే తప్ప తగ్గించడం అనే మాటే ఉండదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు వెసలుబాటు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఐదేళ్ల తర్వాత మొదటిసారి ట్రూ అప్ నుంచి ట్రూడౌన్ నిర్ణయం తీసుకుంటోందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఫోర్త్ కంట్రోల్ పీరియడ్ అయిన 2019-24 మధ్యలో రూ.1,059.75 కోట్ల ట్రూడౌన్‌ను ఏపీ ట్రాన్స్‌కో ప్రకటించింది.
దీనిపై కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీన్ని మూడు విభాగాల నుంచి సర్దు బాటు చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఈపీడీసీఎల్‌లో రూ.383.84 కోట్లు, ఎస్‌పీడీసీఎల్ లో రూ.428.56 కోట్లు, సీపీడీసీఎల్ లో రూ.247.35 కోట్ల సర్దుబాటు లెక్కలను తీసుకొచ్చారు. ఈ ఫోర్త్ కంట్రోల్ పీరియడ్ టైమ్ లో విద్యుత్ వినియోగానికి కేటాయించిన నిధులను, వాస్తవ ఖర్చులను బేరీజు వేసుకుని మిగిలిన దాన్ని ఇలా సర్దుబాటు రూపంలో ట్రూడౌన్ కోసం వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దీనిపై ట్రాన్స్ కో పిటిషన్ వేసింది. దానిపై కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం వెనకుండి కాబట్టి కమిషన్ కూడా ఆమోదించే ఛాన్స్ ఉంటుంది.
మొత్తం మీద చాలా రోజుల తర్వాత ఏపీలో ట్రూడౌన్ రావడంతో విద్యుత్ వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సోలార్ విద్యుత్ తయారీ కేంద్రాలపై దృష్టి పెడుతోంది. అవే గనక అందుబాటులోకి వస్తే కరెంట్ ఖర్చులు అనేవి దాదాపు ఉండకపోవచ్చని అంటున్నారు.