జనసేన నేతలు, కార్యకర్తలపై దాడులు.! బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు.! టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు.! దాడులు చేస్తున్నదేమో వైసీపీ నేతలు, కార్యకర్తలు.!
ఇదేమీ వైసీపీ హయాం కాదు.! అప్పట్లో అయితే, పైన చెప్పుకున్న నేరాలు నిర్లజ్జగా జరిగాయ్. హత్యలు జరిగినా, అత్యాచారాలు జరిగినా అప్పట్లో పోలీసు వ్యవస్థ చేష్టలుడిగి చూసింది. ‘ఒకట్రెండు రేప్‌లకే రాద్ధాంతమా.?’ అని అప్పట్లో ఓ మహిళా మంత్రి సెలవిచ్చారు.
హోంమంత్రిగా మహిళ వుండి కూడా అప్పట్లో, అఘాయిత్యాలపై స్పందిస్తూ, ‘రేప్ చేయాలని నిందితులు రాలేదు.. అనుకోకుండా జరిగిపోయింది..’ అని చెప్పడం చూశాం. నేరాలు అప్పట్లో ఎంత సర్వసాధారణంగా మారిపోయాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
ఆ నేరాల నుంచి ప్రజలూ విసిగిపోయారు. వైసీపీని పాతరేశారు. మరి, కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు ఎలా వున్నాయి.? నిజానికి, నేరాలు అదుపులోకి వచ్చాయి. నేరాల పరంగా ‘జీరో’ అనేది చూడలేం. అది అసాధ్యం కూడా.! కానీ, నేరాల్ని కొంతమేర అదుపు చేయడం సాధ్యమవుతుంది. అదుపు చేస్తోంది కూడా ప్రస్తుత ప్రభుత్వం.
అయితే, రాజకీయ నేరాలు మాత్రం అదుపులోకి రావడంలేదు. కూటమి పాలనలో, కూటమి పార్టీల నేతలు, నాయకులపై దాడులు జరుగుతూనే వున్నాయి. మరీ ముఖ్యంగా, టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు నిత్యకృత్యమైపోయాయి.
ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ, ఆ అక్కసుతోనే తమ మీద దాడులు చేస్తోందన్నది టీడీపీ ఆరోపణ. కేవలం ఆరోపణలు చేస్తే సరిపోదు, అధికారంలో వుంది కాబట్టి, తగిన చర్యలు తీసుకోవాల్సింది టీడీపీ అధినాయకత్వమే.
దాడులకు ప్రతిదాడులు ఎప్పుడూ సమాధానం కాదు. భౌతిక దాడులకు ప్రజాస్వామ్యంలో చోటుండకూడదు. కానీ, హత్యలు జరుగుతున్నాయ్.. కార్యకర్తల్ని కోల్పోతోంది తెలుగుదేశం పార్టీ. ‘ఇలాగైతే, టీడీపీ జెండాలు మోయడానికి కార్యకర్తలు మిగలరు..’ అంటూ పార్టీ కార్యకర్తలు, నేతలు.. అధినాయకత్వంపై గుస్సా అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
డీజీపీకి ముఖ్యమంత్రి అల్టిమేటం జారీ చేశారన్న వార్త కూడా, టీడీపీ కార్యకర్తల్లో మనో ధైర్యం నింపడంలేదంటే, పరిస్థితి తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఓ వైపు, ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు, పుండు మీద కారం చల్లినట్లున్నాయి టీడీపీ నేతలు, కార్యకర్తలకి. ఆ రెడ్ బుక్ రాజ్యాంగమే అమలైతే, తమ కార్యకర్తలు ఎందుకు చనిపోతారన్నది టీడీపీ క్యాడర్ వ్యక్తం చేస్తున్న ఆవేదన.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో, టీడీపీ కార్యకర్తల చావులు.. అదీ వైసీపీ నేతల రాజకీయ దాడుల్లో.. అంటే, అది ఆషామాషీవ్యవహారం కాదన్నది టీడీపీ క్యాడర్ నుంచి వ్యక్తమవుతున్న ఆవేదన, బాధ.
రాజకీయ దాడులపై ఉక్కుపాదం మోపాల్సిందే.. తప్పదు.! లేదంటే, సమాజంలో అలజడులు తీవ్రమవుతాయి. అది, రాష్ట్రానికి అస్సలు మంచిది కాదు.
ఇదే అభిప్రాయం, కూటమిలో టీడీపీకి మిత్రపక్షాలు అయిన జనసే, బీజేపీ నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. సాధారణ నేరాలు అదుపులోకి వచ్చినా, రాజకీయ పరమైన నేరాలు, అదీ వైసీపీ క్యాడర్ చేస్తన్న అరాచకాలకు అడ్డకట్ట వేయకపోతే ఎలా.? అంటూ ఆవేదన చెందుతున్న తెలుగు తమ్ముళ్ళకు ఇకనైనా అధినాయకత్వం నుంచీ, తమ ప్రభుత్వం నుంచీ భరోసా లభిస్తుందా.? వేచి చూడాల్సిందే.