తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పర్సంటేజ్ విధానంపై నిర్ణయాలు తీసుకునే సబ్ కమిటీ నుంచి నిర్మాతలు డి. సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన నట్టి కుమార్, పర్సంటేజ్ విధానం అమలుకు నిర్మాతలు వ్యతిరేకం కాదని, అయితే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల ప్రయోజనాలు సమతుల్యంగా ఉండేలా అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
రెంటల్ విధానంలో వచ్చే ఆదాయంతో పోలిస్తే కొంత మెరుగైన ఆదాయం కోరడంలో థియేటర్ యజమానుల తప్పు లేదని, కానీ అసమంజసమైన డిమాండ్లు పరిశ్రమకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా నష్టపోతే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునే వ్యవస్థ లేదని, చాలామంది ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేసిన సబ్ కమిటీ ప్రస్తుతం సురేష్ బాబు, దిల్ రాజు నేతృత్వంలో పనిచేస్తోందని గుర్తు చేసిన నట్టి కుమార్, వారిద్దరూ లీజ్ ఆధారిత థియేటర్ వ్యవస్థకు దగ్గరగా ఉండటంతో ఎగ్జిబిటర్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అన్నారు. దీనివల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందనే ఆందోళన పరిశ్రమలో వ్యక్తమవుతోందని తెలిపారు.
ఈ నేపథ్యంలో సురేష్ బాబు, దిల్ రాజు కమిటీ నుంచి తప్పుకుని, వారి స్థానాల్లో కె.ఎల్. నారాయణ, శ్యాంప్రసాద్ రెడ్డి వంటి అనుభవజ్ఞులను నియమించాలని ఆయన సూచించారు. పరిశ్రమలోని అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని శాశ్వత పరిష్కారం దిశగా సబ్ కమిటీ పనిచేయాలని కోరారు.
ఇదే సమావేశంలో ‘పెద్ది’ సినిమా కలెక్షన్లపై వస్తున్న ప్రచారాన్ని కూడా నట్టి కుమార్ ఖండించారు. ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతోందని, కలెక్షన్లు తగ్గిపోయాయనే వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు.
చాలా కాలం తర్వాత థియేటర్లకు భారీ ఊపు తీసుకొచ్చిన చిత్రంగా ‘పెద్ది’ నిలిచిందని ఆయన పేర్కొన్నారు. పెద్ద సినిమాల కొరతతో ఇబ్బందులు పడుతున్న ఎగ్జిబిటర్లకు ఈ సినిమా కొత్త ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. హీరో రామ్ చరణ్ తన పాత్ర కోసం ఎంతో కష్టపడి నటించారని, ఆ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారని నట్టి కుమార్ ప్రశంసించారు. ప్రేక్షకుల ఆదరణతో సినిమా విజయవంతంగా కొనసాగుతోందని ఆయన తెలిపారు.
