కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ ను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే ప్రజా దర్బార్ తలుపు తడుతున్నారు. మంత్రి కూడా ఎంతో ఓపికగా వారి సమస్యలను వింటూ పరిష్కరిస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ 50రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఈ దర్బార్ లో దాదాపు 75శాతం విజ్ఞప్తులను పరిష్కరించారు. ఈ 50 రోజుల్లో మొత్తం 5,810 విజ్ఞప్తులు వచ్చాయి. ఇందులో 4,400 అర్జీలను పరిష్కరించారు.
ఇంకా 1,410 విజ్ఞప్తులు పరిష్కార మార్గంలో ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హెల్త్, పంచాయతీ రాజ్, మున్సిపల్, భూ వివాదాలు, ఆర్థిక పంచాయితీలు, లీగల్ సమస్యలు, హోంశాఖ ఫిర్యాదులు, విద్యా పరమైన అర్జీలు చాలానే వస్తున్నాయి. భూవివాదాలు 1,585 అర్జీలు వస్తే ఇందులో 1,170 అర్జీలను పరిష్కరించారు. హోంశాఖ అర్జీలు 1,276 వస్తే ఇందులో 1,158 పరిష్కారమయ్యాయి. జాబుల కోసం 800 అర్జీలు వస్తే 347 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మరో 356 పింఛన్ సమస్యలను కూడా పరిష్కరించారు మంత్రి లోకేష్.
వీరే కాకుండా అత్యవసరంగా వైద్య సహాయం అవసరం ఉన్న చాలా మందికి మంత్రి లోకేష్ సాయం అందిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన మహిళకు యాక్సిడెంట్ అయితే ఆమెకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.5 లక్షల సాయం అందించి ప్రాణాలు నిలిపారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని సమస్యలు అన్నీ ప్రజాదర్బార్ కు వస్తున్నాయి. ఇక్కడకు వచ్చిన అర్జీలు కూడా సత్వరమే పరిష్కారం కావడంతో ప్రజలు ఇక్కడికి పోటెత్తుతున్నారు.