తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మళ్ళీ ప్రారంభమవుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఆగిపోయిన యువగళం పాదయాత్ర, ఎక్కడైతే ఆగిపోయిందో, అక్కడి నుంచే పునఃప్రారంభమవుతోంది.
ముగింపు ఎక్కడ.? అన్నదానిపై స్పష్టత లేదు. హడావిడిగా ముగించేయాలన్న ఆలోచనతో అయితే టీడీపీ అధినాయకత్వం వుంది. అందుకు తగ్గ రోడ్ మ్యాప్ ఇప్పటికే ఖరారయినట్లు తెలుస్తోంది.
ఇక, యువగళం పాదయాత్ర ప్రారంభమవుతూనే, నందమూరి తారకరత్నను బలి తీసుకున్న విషయం విదితమే. పాదయాత్ర ప్రారంభం రోజునే, నందమూరి తారకరత్నకు గుండె పోటు రావడం, హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం, అచేతనావస్థలో ఆసుపత్రిలోనే కొన్నాళ్ళు మృత్యువుతో పోరాడి, చివరికి ప్రాణాలు వదలడం తెలిసిన విషయమే.
ఇక, లోకేష్ పాదయాత్ర జరుగుతున్నప్పుడే, చంద్రబాబు అరెస్టయ్యారు. అటు తారకరత్న మరణం.. ఇటు చంద్రబాబు అరెస్టు.. ఈ రెండిటినీ, యువగళం పాదయాత్ర తాలూకు చేదు ఫలితాలుగా టీడీపీ క్యాడర్‌లో చాలామంది భావించడం మొదలైంది. ఈ నేపత్యంలో ఇకపై పాదయాత్ర వద్దే వద్దు.. అన్న చర్చ కూడా టీడీపీలో జరిగింది.
కానీ, సుదీర్ఘ పాదయాత్ర.. అనే క్రెడిట్ కోసం ఎలాగోలా ఆ పాదయాత్రను నారా లోకేష్ పూర్తి చేయాలనుకుంటున్నారట. గతంలో చేసిన పాదయాత్ర వేరు. ఇప్పుడు చేయనున్న పాదయాత్ర వేరు. ఈసారి చాలా చాలా ప్రత్యేకం, ఒకింత కఠినం.! ఔను, క్యాడర్‌లో జోష్ పెరిగినా, పాదయాత్ర పట్ల పెద్దగా ఆసక్తి చూపడంలేదు.
ఇప్పటికే పాదయాత్ర కోసం చాలా చాలా ఖర్చు చేసింది టీడీపీ. ఇంకా ఖర్చు చేయడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. జనసేన – టీడీపీ పొత్తు నేపథ్యంలో, ఆయా నియోజకవర్గాల్లో సీటు తమకే కేటాయించాలని స్థానిక టీడీపీ నాయకత్వం ఒకింత ఒత్తిడిని టీడీపీ అధినాయకత్వంపై పెంచేందుకు, లోకేష్ పాదయాత్రను అవకాశంగా మార్చుకునే అవకాశాలూ లేకపోలేదు.
మరి, ఈ ఇబ్బందుల్ని లోకేష్ ఎలా అధిగమించి యువగళం పాదయాత్రను పూర్తి చేస్తారో వేచి చూడాల్సిందే.