జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్‌ను అన్న అంటూ సంబోధిస్తూ మంత్రి లోకేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసైనికులు సోషల్ మీడియా ద్వారా లోకేష్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ద్వారా లోకేష్ స్పందిస్తూ… జనసేన పార్టీ 12 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పార్టీకి చెందిన నాయకులు, కార్మికులు, కార్యకర్తలు అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సామాజిక వృద్దికి జనసేన పార్టీ నిబద్దత నిజంగా ప్రశంసనీయం. రాష్ట్రాన్ని పురోగతి దిశగా నడిపించడంలో జనసేన పార్టీ నాయకుల పాత్ర నిస్సందేహంగా ఉజ్వలమైనదని ట్వీట్ చేశారు.
జనసేన పార్టీ అధికారంలో ఉన్న మొదటి సారి జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవం కావడంతో జనసైనికులు రెట్టించిన ఉత్సాహంతో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నేడు జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కాబోతున్నారు. దేశ విదేశాల నుంచి జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.