విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రబాబు ఆలోచన, భువనేశ్వరి ఆచరణ కలిపి ఎన్టీఆర్ ట్రస్ట్ అని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం సందర్భంగా తలసీమియా బాధితుల కోసం విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
” తలసీమియా బాధితుల కోసం దాతలు ఇచ్చిన ప్రతి రూపాయి వారి ప్రాణాన్ని కాపాడుతుంది. 1997లో ఒక్క అడుగుతో ఈ ట్రస్ట్ ప్రయాణం ప్రారంభమైంది. 28 ఏళ్ల ప్రస్థానంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించింది. ఫ్యాక్షన్ హింసకు గురైన అనేక కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆశాజ్యోతి గా నిలిచింది. వారి పిల్లలకు విద్య తో పాటు ఆర్థికంగా మద్దతును అందిస్తోంది. 2013లో ఉత్తరాఖండ్ వరదల్లో 510 మంది తెలుగు ప్రజలు చిక్కుకుపోతే వారిని స్వస్థలాలకు చేర్చడంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చురకైన పాత్ర పోషించింది. గతేడాది విజయవాడ వరదల సమయంలోనూ బాధితులకు అండగా నిలిచింది. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన సమయంలో బాధితులైన 48 కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఇక ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 మహమ్మారి బాధితులను ఆదుకోవడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ సవాలుగా స్వీకరించింది. ఆ క్లిష్ట సమయంలో అవసరమైన వారికి మాస్క్ లు, మందులు, ఆక్సిజన్ సరఫరా చేసింది. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం కూడా చేసింది. ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు 8.70 లక్షల మంది రోగులకు రక్తాన్ని అందించడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. ఇక తలసీమియా బాధితులను ఆదుకోవడానికి ఇప్పటివరకు 13వేల ఆరోగ్య శిబిరాలను నిర్వహించి, రూ. 23 కోట్ల విలువైన మందులను పంపిణీ చేసింది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని బ్లడ్ బ్యాంకులు, బ్లడ్ రీసెర్చ్ సెంటర్ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తాం” అని నారా లోకేష్ తెలిపారు.