రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలకు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. పాఠశాలల గుర్తింపు గడువును పదేళ్లకు పెంచుతామని ప్రకటించారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, యాజమాన్యాలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందరూ కలిసి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
విద్యాశాఖ మంత్రిగా తనపై ఎంతో బాధ్యత ఉందని రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో నైతిక విలువలు పెంపొందించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. వైసీపీ హయాంలో విద్యా వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని, విద్యార్థుల డ్రాప్ అవుట్ రేట్ భారీగా పెరిగిందని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ప్రమాణాలు పెంచి పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబెడతామని అన్నారు. ప్రైవేట్ స్కూల్స్ కోసం క్యాంపస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడంతో పాటు ఫైర్ సర్టిఫికెట్, స్ట్రక్చరల్ ఎన్ఓసి, శానిటేషన్ సర్టిఫికేట్ తదితరాలు త్వరగా మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.