రెండు రాజకీయ పార్టీలు కలిసి పని చేస్తున్నప్పుడు, ఇరు పార్టీల నాయకులే కాదు, కార్యకర్తలు కూడా అంతే స్థాయిలో ఒకర్నొకరు కలుపుకుని పోవాలి.! లేకపోతే, పార్టీల ‘పొత్తు’కి అర్థమే లేకుండా పోతుంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ – జనసేన మధ్య ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పొత్తూ లేదు. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తోంది టీడీపీ. మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీకి టీడీపీ మద్దతిస్తోంది. చాలా కొన్ని చోట్ల మాత్రం, జనసేన పార్టీకి టీడీపీ మద్దతిస్తున్నమాట వాస్తవం.
అధినాయకత్వం స్థాయిలో జనసేన పార్టీకి తెలంగాణలో టీడీపీ ఇంతవరకు మద్దతు ప్రకటించలేదు. కానీ, ఎక్కడికక్కడ స్థానిక నాయకులు, తమ పరిస్థితుల్ని బట్టి ఆయా రాజకీయ పార్టీలకు మద్దతిస్తున్నారు. అది వేరే చర్చ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం టీడీపీ – జనసేన కలిసి పని చేస్తున్నాయి. అయితే, టీడీపీ క్యాడర్‌లో ఓ వర్గం ఇంకా, జనసేన పార్టీని మిత్రపక్షంగా భావించడంలేదు. ఆ గ్యాప్‌ని తగ్గించడానికి సమన్వయ కమిటీలు ఏర్పాటయ్యాయి ఇరు పార్టీల నుంచీ.
ఇంకోపక్క, నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర నేడు పునఃప్రారంభమైంది. ప్రారంభమవుతూనే, నారా లోకేష్ ‘జై జనసేన’ అంటూ నినదించారు. ‘పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్థిల్లాలి’ అంటూ నినదించడం ద్వారా నారా లోకేష్, టీడీపీ శ్రేణులకు స్పష్టమైన సందేశం పంపారు.
ఈ ‘జై’ కొట్టడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు, తెలంగాణకీ వర్తిస్తుందన్న చర్చ టీడీపీ శ్రేణుల్లోనే జరుగుతోంది. దాంతో, తెలంగాణలో జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో మరింత ఉత్సాహంగా టీడీపీ క్యాడర్ పాల్గొనడం షురూ అయ్యింది.
అయితే, సోషల్ మీడియాలో మాత్రం కొందరు తెలుగు తమ్ముళ్ళు ఇంకా జనసేన మీద పనికిమాలిన ట్వీట్లేస్తూ, రెండు పార్టీల మధ్యా చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తూనే వున్నారు.!