దావోస్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వరుసగా పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న అంశాలను వివరిస్తూ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారు. ఇక తాజాగా ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ తో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలోని భావనపాడును పెట్రోకెమికల్ హబ్‌గా మార్చడానికి మిట్టల్ గ్రూప్ పెట్టుబడులు పెట్టాల్సిందిగా రాష్ట్ర ఐటి మంత్రి నారా లోకేష్ కోరారు. దావోస్ లోని బెల్వేడార్ లో మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో ఏపీలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న అనేక విషయాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. పెట్రో కెమికల్స్ కోసం భావనపాడు ఎంతో అద్భుతంగా ఉంటుందని తెలిపారు. అలాగే 83.3 MTPA సామర్థ్యం గల పోర్టు, వైజాగ్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎనర్జీ ఇప్పటికే కొలువై ఉన్నట్టు ఆయన వివరించారు. గ్రీన్ ఎనర్జీలో పెట్రో కెమికల్స్ వెలికితీతకు అనుకూలంగా ఉంటుందని వివరించారు. మిట్టల్ పార్ట్ నర్ అయిన HMEL – HPCL-మిట్టల్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.3,500 కోట్లతో ఇండియాలో ఏర్పాటు చేయాలని చూస్తున్న 2 GW సామర్థ్యం ఉన్న సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉంటుందని లోకేష్ వివరించారు.
లోకేష్ వివరణకు మంత్రి లక్ష్మీ మిట్టల్ రిప్లై ఇచ్చారు. ఇప్పటికే తాము జపాన్ కంపెనీ నిప్పాన్ స్టీల్ జెవితో కలిసి 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో స్టీల్ కంపెనీని ఏపీలో ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రూ.104లక్షల కోట్ల పెట్టుబడితో దీన్ని నిర్మిస్తున్నామన్నారు. గ్రీన్‌కో వారి హైడ్రో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌ను ఉపయోగించి 975 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ సామర్థ్యంతో అనకాపల్లిలో ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. అందుకు నారా లోకేష్ కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో లక్ష్మీమిట్టల్ కుమార్ ఆదిత్య మిట్టల్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి టిజి భరత్, ఎపి ఈడిబి సిఇఓ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు.