పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాలని వారిలో చైతన్యం కలిగించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంద్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో ఎకో పార్క్ లో స్వచ్చాంద్ర కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు. పార్క్ లో చెత్తను స్వయంగా శుభ్రం చేసి చెత్తకుండీలో వేశారు లోకేష్.
స్వచ్చాంద్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుడు ఎమ్ నాగార్జునతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. అతని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఊరు, పనిచేస్తున్న స్థలం గురించి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో పారిశుద్ధ్య నిర్వహణకు కావాల్సిన సామాగ్రి ఎలా ఉందని.. చెత్తకుండీలు ఉన్నాయా అని అడిగారు లోకేష్. ఎకో పార్క్ లో ఏం చేస్తే ఇంకా బాగుంటుందని అడిగి తెలుసుకున్నారు.
ప్రజలు నిద్రలోకి వెళ్లాక పారిశుద్ధ కార్మికులు పరిసరాలను శుభ్రం చేస్తారని నారా లోకేష్ ప్రశంసించారు. మంగళగిరి ఎకో పార్క్ బాగుందని.. మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి లోకేష్. పారిశుద్ధ్యం, పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పులు తీసుకు రావాలని అన్నారు.
కూటమి ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర కార్యక్రమం ప్రవేశ పెట్టింది. స్వచ్చతలో మంగళగిరిని ఆదర్శ కార్పోరేషన్ గా తీర్చిదిద్దుతామని అన్నారు లోకేష్. పరిసరాలను శుభ్రంగా ఉంచే విషయంలో ప్రజలకు కూడా బాధ్యత పెడితే పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు తెలుస్తాయని అన్నారు. మంగళగిరిలో భూగర్భ డ్రైనేజీ, అండర్ వాటర్, గ్యాస్, పవర్ అందుబాటులోకి వస్తే సమస్యలు తీరుతాయని అన్నారు నారా లోకేష్. పారిశుద్ధ్య నిర్వహణలో మంగళగిరిని నెం.1 స్థానంలో నిలబెడతామని అన్నారు.
అనంతరం పారిశుద్ధ్య కార్మికుడు నాగార్జునను మంత్రి లోకేష్ శాలువాతో సత్కరించారు. ఎకో పార్క్ లో వాకింగ్ చేసే మంగళగిరి వాసులకు సొంతంగా 5 లక్షలతో ఉచిత ప్రవేశం కల్పించారు నారా లోకేష్. అందుకు నేచర్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.