Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబసమేతంగా శనివారంనాడు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఇటివల ప్రధాని అమరావతి వచ్చిన సందర్భంలో ఢిల్లీ రావాలని మంత్రి లోకేశ్ ని ఆహ్వానించిన సందర్భంగా ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు లోకేశ్.
ఈ సందర్భంగా ‘యువగళం’ కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మొదటి ప్రతిని అందుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు లోకేష్ చేపట్టిన 3,132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్ బుక్ లో పొందుపరిచారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని దానిపై సంతకం చేసి లోకేష్‌కు అందించారు. దాదాపు రెండు గంటలపాటు వీరి భేటీ కొనసాగింది.
రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన మద్దతుకు లోకేశ్ కృతజ్ఞతలు తెలుపుతూ.. భవిష్యత్తులోనూ సహకరించాలని కోరారు. జాతీయ భద్రత, దేశాభివృద్ధిలో ప్రధాని నిర్ణయాత్మక నాయకత్వానికి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకోవడంలో సహకారం అందించేందుకు దిశానిర్దేశం చేయాలని లోకేష్ కోరారు.
