ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఐటీ మంత్రి నారా లోకేష్ కోరారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని రాజ్ నాథ్ సింగ్ నివాసానికి లోకేష్ వెంట రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, ఇతర ఎంపీలు వెళ్లారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఇద్దరూ చర్చించారు. ఇప్పుడు ఏపీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని.. పెట్టుబడులకు, ఇతర కేంద్ర సంస్థలకు అనుకూలంగా ఉన్న విషయాలను లోకేష్ వివరించారు.
ఏపీలో డిఫెన్స్ రంగానికి సంబంధించిన పరికరాలను ఏపీలో తయారు చేస్తే.. ఇతర పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయని.. అప్పుడు ఏపీ అభివృద్ధి సులభతరం అవుతుందని లోకేష్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే కేంద్రం కేటాయించిన నిధులతో అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పనులను కూడా లోకేష్ కు వివరించారు. గతంలో ఏ విధంగా వాటి పనులు వెనకబడ్డాయో.. ఇప్పుడు కూటమి హయాంలో వాటి పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో కూలంకుషంగా చెప్పారు. ఏపీకి రూ.10లక్షల కోట్ల అప్పులు గత జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అయిందని.. వాటి నుంచి ఏపీ బయట పడటానికి కేంద్రం సాయం చేయాల్సిందిగా కోరారు.
ప్రధాని నరేంద్రమోడీ వికసిత్ భారత్ కు అనుగుణంగా తాము పనిచేస్తున్నామని.. ఏపీ అభివృద్ధికి కేంద్రం పెద్ద పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. లోకేష్ వివరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా స్పందించారు. ఏపీకి ఆర్థిక సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.