ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రెండు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. కార్యక్రమం మొత్తం రాజకీయ చర్చలకు దూరంగా, కుటుంబ సమ్మేళనం తరహాలో ఉల్లాసంగా సాగింది.
విందుకు వచ్చిన ప్రతి కుటుంబాన్ని నారా లోకేష్ సాదరంగా ఆహ్వానిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు వచ్చిన చిన్నారులతో సరదాగా మాట్లాడి, బాగా చదువుకుని జీవితంలో ఎదగాలని సూచించారు. ఆత్మీయ సంభాషణలతో అక్కడ నవ్వులు పూశాయి. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు నారా లోకేష్ స్వయంగా భోజన ప్లేట్లు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా విశాఖపట్నం అభివృద్ధి కోసం లోకేష్ చేస్తున్న కృషిని ప్రజాప్రతినిధులు అభినందించారు. ముఖ్యంగా విశాఖకు గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థను తీసుకురావడంలో చేసిన ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి గుర్తుగా నేతలు అందించిన ఫోటో ఫ్రేమ్‌లో “వైజాగ్” అనే పదంలో ‘జీ’ అక్షరాన్ని గూగుల్ లోగో తరహాలో రూపొందించి అందజేశారు. ఇది కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విందు సందర్భంగా నియోజకవర్గాల అభివృద్ధి, స్థానిక సమస్యలపై ప్రజాప్రతినిధులు సిద్ధం చేసిన గ్రీవెన్స్ స్టేటస్ రిపోర్టులను నారా లోకేష్ వారికి అందజేశారు. అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే దిశగా సమన్వయం కొనసాగించాలని ఆయన సూచించారు. కార్యక్రమానికి హాజరైన మహిళలకు తన నియోజకవర్గంలోని చేనేత కళాకారులు నేసిన మంగళగిరి పట్టుచీరలను చిరు కానుకగా అందజేశారు.
ఈ విందు సమావేశానికి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు ముతుకుమిల్లి భరత్, ఎమ్మెల్యేలు పీజీవీఆర్ నాయుడు (గణబాబు – విశాఖ వెస్ట్), గంటా శ్రీనివాసరావు (భీమిలి), వెలగపూడి రామకృష్ణబాబు (విశాఖ ఈస్ట్), వంశీకృష్ణ శ్రీనివాస్ (విశాఖ సౌత్), విష్ణుకుమార్ రాజు (విశాఖ నార్త్), పల్లా శ్రీనివాసరావు (గాజువాక), కోళ్ల లలితకుమారి (శృంగవరపుకోట), ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు హాజరయ్యారు. అరకు పార్లమెంట్ పరిధి నుంచి మంత్రి గుమ్మడి సంధ్యారాణి (సాలూరు), తోయక జగదీశ్వరి (కురుపాం), బోనెల విజయచంద్ర (పార్వతీపురం), నిమ్మక జయకృష్ణ (పాలకొండ), ఎం శిరీషాదేవి (రంపచోడవరం) కుటుంబసభ్యులతో కలిసి ఈ ఆత్మీయ విందులో పాల్గొన్నారు.
రాజకీయ చర్చలకు దూరంగా, కుటుంబ సభ్యులతో కలిసి జరిగిన ఈ సమావేశం ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధుల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచిందని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి అంశాలపై పరస్పరం చర్చించుకుంటూ, అనౌపచారిక వాతావరణంలో జరిగిన ఈ సమ్మేళనం ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది.

