ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గాలిలో మేడలు కట్టే ఫ్యాన్సీ విద్యా విధానాల కంటే, విద్యార్థుల్లో ప్రాథమిక అభ్యసన సామర్థ్యాలను పెంచడమే అసలైన సంస్కరణ అని భావించిన లోకేష్.. రాష్ట్ర విద్యా వ్యవస్థలో మూలస్థాయి మార్పులకు శ్రీకారం చుట్టారు. నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (NAS), ASER నివేదికల్లో బయటపడిన లోపాలను గుర్తించి, వాటి ఆధారంగా ప్రాథమిక విద్యను బలోపేతం చేసే చర్యలను అమలు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 38,391 ప్రాథమిక పాఠశాలల్లో దేశంలోనే తొలిసారిగా “గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ” (G-FLN) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. చిన్నారులు ఒత్తిడితో కాకుండా ఆటపాటలతో, సరదాగా చదువు నేర్చుకునేలా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ విధానాన్ని తీసుకువచ్చారు. చిత్రాలు, ఆటలు, కథలు, ఫ్లాష్ కార్డులు, బాలా ఫీచర్స్ ద్వారా తెలుగు, ఇంగ్లీష్, గణితం బోధిస్తున్నారు. “జ్ఞానజ్యోతి”, “జ్ఞానప్రకాశ్” వంటి మాడ్యూల్స్ ద్వారా ప్రతి అక్షరాన్ని అనుభూతి చెందుతూ నేర్చుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు.
విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి, వారి స్థాయికి అనుగుణంగా ప్రత్యేక పాఠ్య ప్రణాళికలు రూపొందించారు. రెగ్యులర్ క్లాసుల తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి 3.30 గంటల వరకు రెమెడియల్ సెషన్లు నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థులకు అదనపు బోధన అందిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసనాన్ని మరింత సులభతరం చేసేందుకు భారీ స్థాయిలో బోధనాభ్యసన సామగ్రిని పంపిణీ చేశారు. “జాదూయ్ పిటారా” పేరుతో 62 రకాల కృత్యాధార వస్తువులతో కూడిన ప్రత్యేక లెర్నింగ్ కిట్లు సుమారు 12 వేల పాఠశాలలకు అందించారు. మిగతా పాఠశాలలకు FLN లెర్నింగ్ కిట్లు పంపిణీ చేశారు. తరగతి గదులను ప్రింట్ రిచ్ వాతావరణంగా మార్చేందుకు వర్ణమాల చార్టులు, గుణింతాలు, సంఖ్యలు, వర్డ్ వాల్స్, ఫ్లాష్ కార్డులు, రీడింగ్ కార్నర్లు ఏర్పాటు చేశారు.
“Building as a Learning Aid (BaLA)” విధానంలో పాఠశాల భవనాలనే బోధన సాధనాలుగా మార్చారు. గోడలపై సైన్స్ చిత్రాలు, స్థానిక మ్యాపులు, నేలపై ఇంటరాక్టివ్ గేమ్స్ ద్వారా పిల్లలు చూసి నేర్చుకునే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనివల్ల నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థుల్లో కూడా ఆసక్తి పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
చైల్డ్ ఫ్రెండ్లీ ఫర్నిచర్, అవుట్‌డోర్ ప్లే మెటీరియల్, 75 రోజుల యాక్షన్ ప్లాన్ బుక్స్, స్థాయిల వారీగా స్ట్రీమ్, మౌంటైన్, స్కై లెవెల్ వర్క్‌బుక్స్ అందించారు. ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక హ్యాండ్‌బుక్స్ కూడా సిద్ధం చేశారు. తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలు, IFP ప్యానెల్స్, QR కోడ్ ఆధారిత డిజిటల్ పాఠాలు, ORF యాప్ వంటి సాంకేతిక వనరులను వినియోగిస్తున్నారు.
3, 4, 5 తరగతుల విద్యార్థుల కోసం “Teaching at the Right Level (TaRL)” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పిల్లల స్థాయికి తగ్గట్టే బోధన అందిస్తూ, వారి బలహీనతలను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
ఇక 9వ తరగతి విద్యార్థులను 10వ తరగతికి సిద్ధం చేసేందుకు “రెడీనెస్ ప్రోగ్రామ్”ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఒత్తిడి లేకుండా స్నేహపూర్వక విద్యా వాతావరణంలో విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు.
10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా “100 డేస్ యాక్షన్ ప్లాన్” అమలు చేశారు. 46 స్లిప్ టెస్టులు నిర్వహించి, వాటి ఫలితాలను “లీప్” యాప్ ద్వారా విశ్లేషించారు. విద్యార్థులను “షైనింగ్ స్టార్స్”, “రైజింగ్ స్టార్స్”గా విభజించి ప్రత్యేక బోధన అందించారు. మోడల్ పేపర్లు, ప్రశ్నాబ్యాంకులు, ద్విభాషా ప్రశ్నపత్రాలు అందించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడింది. వెనుకబడిన విద్యార్థుల కోసం 30 రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం భవనాలు, మౌలిక వసతులు మాత్రమే కాకుండా, విద్యార్థులలో నిజమైన అభ్యసన సామర్థ్యాలు పెంపొందించే దిశగా వ్యవస్థను మార్చడమే లక్ష్యంగా నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు. పునాది దశ నుంచే సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారంపై దృష్టి పెట్టడం వల్ల ప్రభుత్వ విద్యలో క్రమంగా మార్పులు కనిపిస్తున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
