2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన మీరు గత ప్రభుత్వ బకాయిలు మేము ఎందుకు చెల్లించాలి అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభం అయిన పలు అభివృద్ధి పనులను మధ్యలోనే నిలిపేశారు అంటూ వైఎస్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకా లోకేష్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలు మార్చారు. మీ విధ్వంస పాలనలో వ్యవస్థను ధ్వంసం చేసేందుకు సిద్ధం అయ్యారు. మీ నిరంకుశ పాలనతో ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పెట్టి వెళ్లిన పలు బకాయిలను విడతల వారిగా చెల్లిస్తున్నాం. ముఖ్యంగా మీరు రూ.4271 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పెట్టి వెళ్లారు.
ఆ బకాయిలు చెల్లించాలని మీరే ఆందోళన చేస్తున్నారు. మీరు పెట్టి పోయిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వంకు ఆర్థిక భారంగా మారినప్పటికీ విద్యార్థుల, తల్లిదండ్రులకు ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు అనే ఉద్దేశంతో చెల్లించేందుకు మా ప్రభుత్వం సిద్ధం అయింది.
ఇప్పటికే రూ.788 కోట్లు విడుదల చేసిన మా ప్రభుత్వం తాజాగా రూ.600 కోట్లు విడుదల చేసింది. త్వరలోనే మరో రూ.400 కోట్లు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ ఏర్పాట్లు చేస్తుంది. దశల వారిగా మొత్తం రీయింబర్స్‌మెంట్‌ను మా ప్రభుత్వం విడుదల చేస్తుందని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు.