మంగళగిరిలో జరిగిన టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జిల శిక్షణ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు చేశారు. “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు వాటి వెనుక ఉన్న సిద్ధాంతాలను కూడా ప్రజలకు వివరించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
తెలుగు జాతికి విశ్వఖ్యాతి తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆ శక్తిని ప్రపంచానికి చాటిన నాయకుడు చంద్రబాబు అని లోకేష్ గుర్తుచేశారు. ఈ ఇద్దరు నాయకుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. సిద్ధాంతాలపై నిలబడే నాయకత్వమే పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి ప్రత్యేక సమయం కేటాయించాలని, గ్రామస్థాయికి పార్టీ ఆరు ముఖ్య సిద్ధాంతాలను తీసుకెళ్లాలని లోకేష్ సూచించారు. “మై టీడీపీ” యాప్ ద్వారా కార్యకలాపాలను నమోదు చేయాలని, ప్రతి ఒక్కరి పనితీరును పార్టీ అధినేత పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గతంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయని, వాటిని గుర్తుంచుకుని ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన అన్నారు. వైసీపీ ఫేక్ ప్రచారాలను ఎదుర్కోవాలని, పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండటం వల్లే అమరావతి, విశాఖ ఉక్కు వంటి కీలక అంశాల్లో పురోగతి సాధ్యమైందని చెప్పారు.
కూటమి భాగస్వాములతో సఖ్యతతో పని చేయాలని, కుటుంబంలా కలిసి చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని లోకేష్ సూచించారు. ఐక్యత, క్రమశిక్షణతో పనిచేస్తే పార్టీ మరింత బలపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

