మహిళలు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయవాడలో జరిగిన ‘ఆటోడ్రైవర్ సేవలో’ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఓ మహిళా ఆటోడ్రైవర్ స్వర్ణలత ఆటోలో సుమారు 11.5 కిలోమీటర్లు ప్రయాణించారు.
ఉండవల్లి నివాసం నుంచి ప్రకాశం బ్యారేజి, విఎంసి ఆఫీస్, కాళేశ్వరరావు మార్కెట్, ఏలూరు లాకులు, సీతంపేట గేటు, సింగ్‌నగర్ ఫ్లైఓవర్, డాబాకొట్టు సెంటర్ మీదుగా మాకినేని బసవపున్నయ్య స్టేడియంకు చేరుకునే వరకు లోకేష్ ఆమెతో ముచ్చటించారు. కుటుంబ నేపథ్యం, జీవన విధానం, ప్రభుత్వ పథకాల లబ్ధి గురించి తెలుసుకున్నారు.
స్వర్ణలత మాట్లాడుతూ 2014లో నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు శిక్షణ పొందినట్లు, ఆ సమయంలో షీ ఆటోలను బాబు గారి చేతుల మీదుగా పొందినట్లు చెప్పారు. తాను విజయవాడ ఆటోనగర్‌లో నివసిస్తోందని, భర్త ప్రోత్సాహంతో ఈ వృత్తిని ఎంచుకున్నట్లు తెలిపారు. తమ కుమార్తె సిఎ చదువుతోందని, కుమారుడు ఆర్మీలో చేరాలని భావిస్తున్నట్టు చెప్పారు.
ఆటోలో ఎక్కువగా మహిళలే ప్రయాణిస్తుంటారని, నెలకు సుమారు పది వేల రూపాయలు సంపాదిస్తున్నానని స్వర్ణలత వివరించారు. పెట్రోల్ ధరలు పెరగడం వల్ల కొంత ఇబ్బంది ఉన్నా, ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఉపయుక్తంగా ఉందని అన్నారు. ఆటోడ్రైవర్ సేవలో పథకం కింద రూ.15 వేలు అందజేయడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
మహిళల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడంలో లోకేష్ చూపుతున్న చొరవకు హ్యాట్సాప్ అని స్వర్ణలత కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, “భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పని చేస్తే కుటుంబం సాఫీగా నడుస్తుంది. మహిళలు ధైర్యంగా ముందుకు సాగేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని అన్నారు.
