మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ మహిళా రాజకీయ సాధికారతపై కీలక ప్రకటన చేశారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తుందని ప్రకటిస్తూ చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా టీడీపీ తమ స్థాయిలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తుందని స్పష్టం చేశారు.
మహానాడులో మాట్లాడుతూ మహిళలు కేవలం లబ్ధిదారులుగా కాకుండా నిర్ణయాలు తీసుకునే స్థాయికి రావాలని అన్నారు. భారత రాజకీయాల భవిష్యత్తు మహిళా నాయకత్వానిదేనని వ్యాఖ్యానించిన లోకేష్.. టీడీపీ మహిళా సాధికారతను నినాదంగా కాకుండా బాధ్యతగా భావిస్తోందన్నారు. మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసే సంస్కృతిని సమాజం నుంచి తొలగించాలని పిలుపునిచ్చారు.
మహానాడు హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించినప్పటికీ కార్యకర్తల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదని లోకేష్ పేర్కొన్నారు. ఆఫ్‌లైన్ అయినా, ఆన్‌లైన్ అయినా, హైబ్రిడ్ మోడల్ అయినా టీమ్-11కి బ్యాటింగ్ తప్పదంటూ వైసీపీపై సెటైర్లు వేశారు. టీడీపీ మహానాడు ప్రతి కార్యకర్త గర్వంగా పాల్గొనే పసుపు పండుగ అని అభివర్ణించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను గుర్తుచేసిన లోకేష్.. సంక్షేమం, అభివృద్ధి, మహిళా హక్కుల విషయంలో ఆయన చూపిన దారినే టీడీపీ అనుసరిస్తోందన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అలాగే చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా “సీబీఎన్” పేరు గౌరవాన్ని తెచ్చిందన్నారు. ఐటీ నుంచి ఏఐ వరకు, హైటెక్ సిటీ నుంచి క్వాంటమ్ వ్యాలీ వరకు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విజన్ చంద్రబాబుదేనని చెప్పారు.
2019 నుంచి 2024 వరకు టీడీపీ కార్యకర్తలు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని లోకేష్ అన్నారు. అరెస్టులు, కేసులు, దాడులు ఎదురైనా కార్యకర్తలు వెనక్కి తగ్గలేదన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి చారిత్రాత్మక విజయాన్ని అందించారని, 94 శాతం స్ట్రైక్ రేట్‌తో 164 సీట్లు సాధించడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించిన లోకేష్.. నాలుగు వేల పెన్షన్, అన్న క్యాంటీన్లు, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్, ఉచిత విద్యుత్, దీపం-2 వంటి పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్పారు. అదే సమయంలో అభివృద్ధి విషయంలో కూడా రాష్ట్రం వేగంగా ముందుకు వెళ్తోందని, గూగుల్, ఫైటర్ జెట్ ప్రాజెక్టులు వంటి భారీ పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని తెలిపారు.
వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన లోకేష్.. “మాది గూగుల్.. మీది గొడ్డలి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. డీఎస్సీ, ఉద్యోగాల అంశాల్లో వైసీపీ చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. “నీది టెన్త్ క్లాస్ పేపర్ కొట్టేసిన హిస్టరీ.. నాది స్టాన్‌ఫోర్డ్ హిస్టరీ” అంటూ జగన్‌పై విమర్శలు గుప్పించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ విజయమే లక్ష్యమని స్పష్టం చేసిన లోకేష్.. అహంకారానికి దూరంగా ఉండి ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయికతో ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని ప్రాజెక్టులు సాధ్యమయ్యాయని తెలిపారు.



