“ప్రభుత్వ విద్య గురించి మాట్లాడితే ఏపీ గురించి మాట్లాడాలి. అందరం కలసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (LEAP)ను సాకారం చేద్దాం” అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విజయవాడ ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో గురుపూజోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు.
లోకేష్ మాట్లాడుతూ, తన జీవితంలో ఉన్న స్థానం మొత్తం ఉపాధ్యాయుల కారణంగానే సాధ్యమైందని, స్కూల్ డేస్‌లో తాను అల్లరి స్టూడెంట్ అయినప్పటికీ, గురువుల మార్గదర్శకత్వం వల్లే స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ వరకు వెళ్లగలిగానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు పిల్లలను చేర్పించేందుకు టీచర్లు ప్రత్యేకంగా ప్రచారం చేయడం, కొంతమంది టీచర్లు స్కూటర్‌కు మైక్ కట్టుకొని వీధి వీధి తిరిగిన ఉదాహరణలు గుర్తుచేశారు. “ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఇన్వెస్ట్‌మెంట్ – హై రిటర్న్స్ ఉంటాయి. ఉచిత యూనిఫామ్, పుస్తకాలు, భోజనం, అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు. అందుకే ఈరోజు కొన్ని పాఠశాలల ముందు No Admissions బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చింది” అని లోకేష్ చెప్పారు.
LEAP మోడల్ అమలు పకడ్బందీగా జరగాలని, కొత్త కరిక్యులమ్, మోడల్ ప్రైమరీ స్కూల్స్, నో బ్యాగ్ డేస్, యోగా, ఎన్‌సీసీ వంటి కార్యక్రమాలతో విద్యలో నాణ్యత పెరుగుతోందని వివరించారు. ఉపాధ్యాయుల సూచనల ఆధారంగానే సంస్కరణలు తీసుకువచ్చామని, వచ్చే నాలుగేళ్లలో వాటిని స్థిరపరుస్తామని చెప్పారు.
డీఎస్సీపై మాట్లాడుతూ, “డీఎస్సీ అంటే చంద్రబాబు గారు.. చంద్రబాబు గారంటే డీఎస్సీ. 13 డీఎస్సీల ద్వారా లక్షా 80 వేలమంది ఉపాధ్యాయులను నియమించారు. ఈసారి కూడా ఎలాంటి ఆటంకం లేకుండా 16,347 మందిని టీచింగ్‌కి తీసుకొస్తున్నాం” అని తెలిపారు.
లోకేష్, విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేలా పాఠ్యాంశాలు, ఇంటర్ కరిక్యులమ్ రీవ్యాంప్, మధ్యాహ్న భోజనం మెరుగుదల, యూనివర్సిటీ స్థాయి బలోపేతంపై కూడా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులను వైన్ షాపుల ముందు కాపలా కాసే పరిస్థితికి దిగజార్చారని విమర్శించారు.
చివరిగా, “మన ఉపాధ్యాయుల శ్రమతో పోటీ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ర్యాంకులు సాధించాలి. ఢిల్లీలో మాజిక్ జరుగుతోందని అంటున్నారు.. దానికి ఫుల్ స్టాప్ పెడదాం. ఇక నుంచి ప్రభుత్వ విద్య అంటే ఆంధ్రప్రదేశ్ అని దేశం, ప్రపంచం గుర్తించేలా కలిసి పనిచేద్దాం” అని నారా లోకేష్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
