వైకాపా ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ పూర్తిగా కుంటు పడిందని మంత్రి లోకేష్ మండలిలో వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలను తరిమేసిందని లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఐటీ పెట్టుబడులు రాబోతున్నాయని, అందుకు సంబంధించిన చర్చలు జరుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మండలిలో ఐటీ అభివృద్ది, కంపెనీల రాక గురించి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ అన్నారు.
విశాఖపట్నంలో ఐటీ పార్క్ ద్వారా 54 కంపెనీలకు 295.68 ఎకరాల భూములను కేటాయించామని, త్వరలో పెద్ద కంపెనీల నుంచి మంచి ప్రకటనలు రాబోతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఐటీ రంగంలో త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని, ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రానున్నట్లు మంత్రి తన ప్రకటనలో తెలియజేశారు. ఐటీ కంపెనీలకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహకాలు ఇవ్వనున్నట్లు తెలియజేశారు.
గత ప్రభుత్వం హయాంలో ఐటీ రంగం తిరోగమనంలో ఉండేదని, పీపీఏలను రద్దు చేయడంతో పాటు, నాపై కోసంతో రాష్ట్రంకు వచ్చిన కంపెనీలను సైతం వెనక్కి పంపించారని మంత్రి లోకేష్ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. వైకాపా ఎంపీలు ఒక వ్యాపారవేత్తపై పార్లమెంట్ సాక్షిగా ఆరోపణలు చేయడంతో ఆయన వైజాగ్‌ను వదిలి పెట్టి వెళ్లి పోయాడు. ప్రస్తుతం 54 కంపెనీల్లో 41 కంపెనీలు కొనసాగుతున్నాయి, అందులో 11,496 మంది పని చేస్తున్నట్లు మంత్రి మండలిలో తెలియజేశారు. ఐటీలో మన రాష్ట్రం రాబోయే రోజుల్లో ప్రముఖ నగరాలతో పోటీ పడే విధంగా మౌళిక వసతుల ఏర్పాట్లు జరుగుతున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు.