Nani: నాచురల్ స్టార్ నాని నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా నాని ప్రమోషన్లు మొదలు పెట్టేశారు. ఇప్పటికే ముంబై సహా కొన్ని నగరాల్లో ప్రచారం చేశారు. వైజాగ్ వేదిక గా టీమిండియా, ఆస్ట్రేలియాల మధ్య ఆదివారం జరిగిన రెండో వన్డే ప్రారంభోత్సవంలో నాని పాల్గొని సందడి చేశారు. మ్యాచ్ కామెంటేటర్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా టీమిండియా క్రికెటర్స్ కి పేర్లు పెట్టాలని నాని ని కోరగా ఫన్నీగా స్పందించారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ‘ జెంటిల్మెన్’ అని, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ‘గ్యాంగ్ లీడర్’ అని, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ‘పిల్ల జమిందార్’ అని పేర్లు పెట్టారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ఆల్టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అని అన్నారు. ‘దసరా’ విషయానికి వస్తే.. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. నాని – కీర్తి కాంబినేషన్లో 2017 లో వచ్చిన ‘నేను లోకల్’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. దీంతో ఈ ఈ కాంబినేషన్లో వస్తున్న ‘దసరా’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాయి కుమార్, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు.