Balakrishna : నందమూరి బాలకృష్ణ వరుసగా మూడవ సారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. గత ఎన్నికల్లో వైకాపా గాలి బలంగా వీచినా కూడా తట్టుకుని నిలబడ్డ బాలకృష్ణ ఈసారి కూడా ఎమ్మెల్యే అయ్యి హ్యాట్రిక్ కొట్టాడు. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నిక అయిన ఘనత అతి కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది.
అలాంటి అరుదైన ఘనత దక్కించుకున్న బాలకృష్ణ కు ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు క్యాబినేట్ లో కీలక మంత్రి పదవి దక్కాల్సిందే అని నందమూరి అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, లోకేష్ కీలక మంత్రిగా ఉండటం వల్ల బాలయ్య కు ఎంత వరకు అవకాశం దక్కుతుంది అనేది అనుమానంగా ఉందని కొందరు అంటున్నారు.
బాలకృష్ణ ఏపీ అసెంబ్లీ లో సీనియర్ ఎమ్మెల్యే. మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే కనుక ఇతర సమీకరణాలు పక్కన పెడితే మంత్రి పదవికి పూర్తిగా అర్హుడు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చంద్రబాబు నాయుడుకు పూర్తి స్థాయి మెజార్టీ రావడంతో పాటు, కేంద్రం లో కూడా కీలకంగా ఉన్నారు.
కనుక తాను బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే ఇవ్వచ్చు. మరి చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటి అనేది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ బాలయ్య కు మంత్రి పదవి వస్తే ప్రస్తుతం చేస్తున్న బాబీ సినిమాను పూర్తి చేస్తాడేమో. ఆ తర్వాత సినిమాలకు బాలయ్య బ్రేక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది మరో వారం పది రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.