ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినుల ఆందోళన తీవ్ర దుమారం రేపుతోంది. గత కొన్ని రోజులుగా యూనివర్సిటీలో పెడుతున్న ఆహారంలో తరచూ పురుగులు వస్తున్నాయని విద్యార్థినులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అయినా సరే సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదు. దీంతో శుక్రవారం ముగ్గురు విద్యార్థినులు భోజనాలు చేస్తుండగా సాంబారులో కప్ప వచ్చింది. దీంతో వారు వెంటనే వార్డెన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం బయటకు చెప్తే భవిష్యత్ లో మీకు ప్రాబ్లమ్ అవుతుంది అంటూ బెదిరించారు.
దాంతో విద్యార్థినులు భయపడ్డారు. కానీ అదే రోజు శుక్రవారం రాత్రి భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిరసనకు దిగారు. సెక్యూరిటీ వాళ్లు బయటకు రాకుండా గేట్లకు తాళాలు వేశారు. కానీ విద్యార్థినులు గేట్లు నెట్టుకుంటూ బయటకు వచ్చి వీసీ కార్యాలయం ముందు బైఠాయించారు. దీంతో ఈ ఘటన ప్రభుత్వం వరకు వెళ్లడంతో సీరియస్ గా స్పందించింది. విద్యాశాఖతో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలంటూ ఆర్డర్ వేసింది. విద్యార్థినులు చేసిన ఆరోపణలు నిజం అయితే వార్డెన్ ను సస్పెండ్ చేయాలంటూ ఆర్డర్ వేసింది.
అలాగే కాంట్రాక్టర్ మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ సీరియస్ గా స్పందిచింది కూటమి ప్రభుత్వం. దాంతో విద్యార్థినులు తమ ఆందోళనను విరమించారు.