మెగాస్టార్ చిరంజీవికి మరో గౌరవం దక్కింది. ఆయనను అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డుకు ఎంపిక చేసినట్లు అక్కినేని నాగార్జున ప్రకటించారు. ఈరోజు ఏఎన్ఆర్ శతజయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అక్టోబర్ 28న ఈ అవార్డు ప్రదానోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ హాజరుకానున్నారు. చిరంజీవికి ఆయన చేతుల మీదుగానే ఈ అవార్డును అందిస్తారు. శుక్రవారం ఏఎన్ఆర్ శతజయంతి సందర్భంగా హైదరాబాదులో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు దర్శకుడు రాఘవేంద్రరావు తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఏఎన్ఆర్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మెగాస్టార్
ఏఎన్ఆర్ శతజయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనతో నటించిన రోజులను ఎప్పటికీ మర్చిపోలేనని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ” అద్భుతమైన నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు ని జయంతి సందర్భంగా స్మరించుకుందాం. అద్భుతమైన పాత్రలతో ఆయన ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతారు. మెకానిక్ అల్లుడు సినిమాతో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం నాకు దక్కింది. ఆ క్షణాలను నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను” అని X లో పోస్ట్ చేశారు.