ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జనసేన పార్టీ నర్సాపురం లోక్‌సభ ఎంపీ అభ్యర్ధి, సినీ నటుడు నాగబాబు పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా జనసేన పార్టీని తొక్కేయాలనే దుగ్దతో కొందరు పెయిడ్ ఆర్టిస్టులు తెరపైకొచ్చి, జనసేన పార్టీపైనా, నాగబాబు పైనా అవాకులూ చవాకులూ పేలారు. కొందరైతే హద్దులు దాటి బూతులు కూడా మాట్లాడారు. అలా బూతులు తిట్టడానికే వాళ్లకి పార్టీ కండువా కప్పి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నట్లున్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. అందుకున్న రెమ్యునరేషన్‌కి తగ్గట్టుగా యాక్టింగ్ చేయకపోతే, తమ పర్‌ఫామెన్స్‌కి బ్యాడ్ టాక్ వస్తుందనుకున్నారేమో కానీ, స్థాయి మర్చిపోయి, నోటికొచ్చింది వాగారు ఆ పెయిడ్ ఆర్టిస్టులు.
అయితే, అవేమీ జగన్ పార్టీకి, జగన్ నడుపుతున్న మీడియా సంస్థకీ బూతుల్లా కనిపించలేదు. నాగబాబు తనపై వచ్చిన విమర్శలకు కౌంటర్ ఇస్తూ, ఫూల్స్, రాస్కెల్స్ అని అనగానే, జనసేన సిద్ధాంతం ఇదేనా.? అంటూ జగన్ పార్టీ జగన్ మీడియా గగ్గోలు పెట్టేయడం జరిగింది. ఎనకటికొకడు తాను చేస్తే శృంగారం.. ఇంకెవడైనా చేస్తే వ్యభిచారం.. అన్నాడట. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు అలానే ఉంది. అమాయకత్వం అనుకోవాలా.? మూర్ఖత్వం అనుకోవాలా.?
రాజకీయాల్లోకి రావాలంటే మినిమమ్ బూతులు వచ్చి ఉండాలనే నిబంధన తప్పనిసరి అన్నట్లుగా ప్రస్తుత రాజకీయ పార్టీలు వ్యవహరిస్తోంటే, అలాంటి కుళ్లు రాజకీయాల్ని, చెత్తని ప్రశ్నించేందుకు పుట్టింది జనసేన పార్టీ. ఓ చెంప మీద కొడితే, రెండో చెంప చూపించాలన్న గాంధీ తత్వం ఇప్పుడేమాత్ర అనుసరనీయం కాదు. అలా చేస్తే రెండు చెంపలూ పగిలిపోతాయ్. అందుకే మాటకి మాట సమాధానమివ్వాలనే దిశగా జనసేన రాజకీయ ప్రయాణం కొనసాగుతోంది.
టీడీపీ, వైసీపీల్లా హద్దులు దాటకపోయినా, ఎవడన్నా, నోటికొచ్చినట్లు తిడితే, ఊరుకునే పరిస్థితి జనసేనలో లేదు. అయినా కానీ, పవన్ పైనో, నాగబాబు పైనో టీడీపీ, వైసీపీ చేస్తున్న దుష్ప్రచారానికి జనసేన నుండి మరీ అంత గట్టిగా ప్రతిస్పందన లేదన్నది నిర్వివాదాశం. దీన్ని సహనం అంటారు. సహనాన్ని చేతకానితనంగా తీసుకుంటే, పరిణామాలు వేరేగా ఉంటాయి. ఆ విషయాన్ని పవన్ కళ్యాణే ఒకటికి పది సార్లు చెప్పారు కూడా. అయినా, బూతుల గురించి జగన్ పార్టీ, జగన్ మీడియా మాట్లాడితే ఎలా.?
వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నాని సాక్ష్యాత్తూ అసెంబ్లీలో బూతులతో చెలరేగిపోయారు. అప్పటికి వైసీపీ ఎమ్మెల్యేగానే ఉన్న సీనియర్ పొలిటీషియన్ జ్యోతుల నెహ్రూ కూడా హద్దులు దాటి ప్రవర్తించారు. రాజకీయాల్లో విలువల్ని దిగజార్చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురివింద చందాన తమ మచ్చల్ని కప్పి పుచ్చుకుని, ఇతరుల్లో మచ్చల్ని వెతికేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతీ శుక్రవారం వివిధ కేసుల్లో నిందితుడిగా కోర్టు విచారణకు హాజరవుతున్న తమ అధినేత ఎంత పద్ధతైన వాడో తొలుత వైసీపీ నేతలు ఆలోచించుకుని, ఆ తర్వాత జనసేన మీద విమర్శలు చేస్తే, కాస్తైనా అర్ధం ఉంటుందేమో.
