రైతుల ధాన్యం కొనుగోలు కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో ఆందోళన చెంది దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దంటూ తెలిపారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో విస్తృతంగా పర్యటించారు మంత్రి నాదెండ్ల మనోహర్. స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తో కలసి చల్లపల్లి మండలం పాత మాజేరు, మంగళాపురం, చల్లపల్లి, కాసానగరం, పెదప్రోలు, ఘంటసాల మండలం లంకపల్లి తదితర గ్రామాల పరిధిలో రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులకు ధాన్యం విషయంలో ఆందోళన చెందొద్దు అంటూ భరోసా ఇచ్చారు. తక్కువ ధరకు దళారులకు అమ్ముకుని మోసపోవద్దంటూ ఆయన స్పష్టం చేశారు. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో తేమ శాతం కాస్త అటు ఇటుగా ఉన్నా సరే కొనుగోలు చేయాలంటూ ఆదేశించారు. ఇతర సమస్యల గురించి రైతులను ఆరా తీశారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయంలో మొత్తం కొనుగోళ్లు అయిపోవాలంటూ సూచించారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కొనుగోలు చేసిన పంటల డబ్బులను కూడా వెంటనే రైతుల ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేయాలంటూ అధికారులను ఆదేశించారు.