Murari: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) కెరీర్లో తొలి సూపర్ హిట్ మూవీ ‘మురారి’ (Murari). క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రేక్షకుల్ని అలరించడమే కాదు.. స్పెషల్ జ్యూరీ విభాగంలో మహేశ్ కు నంది పురస్కారం కూడా దక్కింది. ఇప్పుడీ సినిమాను మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 9న రీ-రిలీజ్ చేయనున్నారు.
ఈ సందర్భంగా అభిమానులు మురారీపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ.. మురారిలో మహేశ్-సోనాలి పాత్రలతో ‘మురారి-వసుంధర’ వివాహ ఆహ్వాన పత్రిక అంటూ పెళ్లి శుభలేఖ తయారు చేసారు. ప్రస్తుతం ఈ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేశ్ అభిమానులను, నెటిజన్లను, చిత్ర దర్శకుడు కృష్ణవంశీని సైతం ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియాలో ప్రశ్నలకు కృష్ణవంశీ సమాధానం ఇచ్చారు. మురారీ 18నిముషాలు ట్రిమ్ చేశామని.. ఎక్కడో మీరే కనుక్కోవాలన్నారు. మహేశ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అని ఆయనతో సినిమా తీయనని అన్నారు. మురారీకే కాదు.. తన సినిమాలేవీ సీక్వెల్ గా తీయడం ఇష్టంలేదన్నారు. ఖడ్గం తరహా సినిమా త్వరలో తెరకెక్కిస్తానని అన్నారు.