తిరుపతి నగరంలో ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన 20 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. గత వైసీపీ ప్రభుత్వం ఈ భూమిని పర్యాటక రంగ అభివృద్ధి పేరుతో ముంతాజ్ హోటల్‌కు కేటాయించింది. అయితే ఈ కేటాయింపుపై అప్పటినుంచి వివిధ ధార్మిక సంస్థలు, హిందూ ఆధ్యాత్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
వీరి వాదన ప్రకారం, తిరుపతి వంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో పెద్ద మొత్తంలో భూమిని ప్రైవేట్ హోటల్ నిర్మాణానికి కేటాయించడం సరికాదని, ఇది భక్తుల భావాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ క్రమంలో భూకేటాయింపులు రద్దు చేయాలని పలు సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.
తాజాగా ఈ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న ఏపీ పర్యాటక శాఖ, కేటాయింపులను రద్దు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీతో, 20 ఎకరాల భూమి మళ్లీ ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది.
స్థానిక ప్రజలు, ధార్మిక సంస్థలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. తిరుపతి పుణ్యక్షేత్ర ప్రతిష్టను కాపాడే దిశగా ఇది ఒక సరైన నిర్ణయమని వారు అభిప్రాయపడుతున్నారు. ఇకపై ఆ భూమిని ప్రభుత్వ అవసరాలకు, భక్తుల సౌకర్యాలకు అనుగుణంగా వినియోగించాలనే డిమాండ్ కూడా వ్యక్తమవుతోంది.
