ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రైలులో భీమవరం వెళ్తున్న తనను ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో చంపేందుకు కుట్ర పన్నారని.. ఇందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. మోదీ పర్యటన సందర్భంగా స్థానిక ఎంపీ హోదాలో ఉండాల్సిన తనను రాకుండా అడ్డుకున్నారని అన్నారు. తన ఇంటి వద్ద ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు అనుమానాస్పదంగా తిరగడంపై కోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు.
ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రయాణం చేస్తున్న బోగిని తగలపెట్టి హత్య చేయటానికి సతెనపల్లిలో 100 మంది గూండాలతో ప్లాన్ చేశారని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రఘురామ భీమవరం బయలుదేరుంటే అదే ఆయనకు చివరి రోజు అయ్యేదని అన్నారు. ఇది నిజం కాదని వైసీపీ అంటే.. సీబీఐతో విచారణ జరిపించాలని అన్నారు. ప్రధాని ఏపీ వస్తున్నప్పుడే ఎంపీని హత్య చేయటానికి ప్లాన్ చేశారంటే.. జగన్ పాలన ఎలా ఉందో అర్థమైందన్నారు.