నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్, మన్నార చోప్రా, సోను సూద్, తనికెళ్ళ భరణి తదితరులు ..
దర్శకత్వం : తేజ
నిర్మాత : అనిల్ సుంకర
సంగీతం : అనూప్ రూబెన్స్
కెమెరా : శిరీషా రే
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు
బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా రెండో ప్రయత్నంగా తెరకెక్కిన చిత్రం సీత. సీనియర్ దర్శకుడు తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లేడి ఓరియెంటెడ్ గా తెరకెక్కింది. విడుదలకు ముందునుండి భారీ అంచనాలు పెంచుకున్న సీత ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సీత ఎవరు ? ఆమె కథ ఏమిటో తెలుసుకుందామా ?
కథ :
సీత ( కాజల్ ) మానవసంబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటాయి తప్ప ఇక్కడ మనుషులకు విలువ లేదని నమ్మే అమ్మాయి. అందుకే డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న పక్కా ఓ స్వార్థపరురాలు అని చెప్పాలి. తన స్వలాభం కోసం ఎవరి జీవితంతోనైనా ఆడుకుంటుంది. అలాంటి సీత ఓ ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంలో భాగంగా లోకల్ ఎంఎల్ఏ అయిన బస్వ రాజు ( సోను సూద్ )తో ఓ అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఆ అగ్రిమెంట్ వల్ల చిక్కుల్లో పడుతుంది సీత. దాన్నుంచి బయట పడడానికి డబ్బులు అవసరం అవుతాయి. అలాంటి సీత అమాయకుడైన తన బావ రామ్ ( శ్రీనివాస్) ని పెళ్లి చేసుకుంటుంది. రామ్ చిన్నప్పటినుండి సమాజానికి దూరంగా ఎలాంటి కుళ్ళు, కుతంత్రాలు తెలియని సమాజంలో చదువుకుంటూ పెరుగుతాడు. అదే బౌద్ధారామం. ఈ పెళ్లి జరగాలంటే రామ్ దగ్గరున్న డబ్బును తన ఖాతాలోకి మార్చుకుంటుంది సీత. రామ్ పేరుమీదున్న ఆస్తిపైనే సీత ఆసక్తి తప్ప రామ్ అంటే అంత ఆసక్తి ఉండదు. సీత ను వెంబడిస్తున్న బస్వరాజ్ నుండి రామ్ ఎలా సీతను కాపాడాడు ? రామ్ మనసును సీత అర్థం చేసుకుందా ? అన్నది మిగతా కథ.
నటీనటుల ప్రతిభ :
సీత .. కథ మొత్తం తన భుజం పై వేసుకుని నడిపించింది కాజల్. ఎవరిననీ లెక్కచేయనితనం, ఓటమిని అంగీకరించని ప్రామిసింగ్ విమెన్ గా మంచి ఆటిట్యూడ్ చూపించింది కాజల్. ఓ వైపు మంచి అమ్మాయిగా, మరోవైపు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రెండు షేడ్స్ లో కనిపించి ఆకట్టుకుంది. ఈ పాత్రను బట్టి చూస్తే కాజల్ నెక్స్ట్ సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఇక అమాయకుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ నటన ఆకట్టుకుంది. అల్లుడు శీను తరహాలో మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. ఇక సోనూసూద్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎం ఎల్ ఏ బస్వరాజు గా సూపర్ అనిపించాడు. ఆయనకు సపోర్టింగ్ రోల్ లో తనికెళ్ళ భరణి ల కాంబినేషన్ అదిరింది. ఇక బిత్తిరిసత్తి కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విషయంలో కాజల్, సోనూసూద్ ల మధ్య నువ్వా నేనా అనే తరహాలో పోటీ నిలిచింది.
టెక్నీకల్ హైలెట్స్ :
ఈ సినిమా విషయంలో సీనియర్ దర్శకుడు తేజ గురించే చెప్పాలి. కథ, కథనం విషయంలో తేజ ఆకట్టుకునే స్థాయిలో కథను నడిపించలేదు. కాజల్ పాత్ర పై పెట్టిన దృష్టి కథనం పై పెట్టలేదు. ఇక అనూప్ అందించిన సంగీతం ఫరవాలేదు. బుల్ రెడ్డి సాంగ్ బాగానే ఆకట్టుకుంది. రీ రీకార్డింగ్ జస్ట్ ఓకే. ఇక కెమెరా పనితనం బాగుంది. చాలా అనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. తేజ సినిమాలో కథ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది, కానీ ఈ సినిమా విషయంలో అలాంటి అనుభూతి కథలో కలగదు. ఎక్కడా ఆకట్టుకోని కథ. కాజల్ లాంటి పాత్రలను మనం ఇదివరకే చాలా చూసేసాం .. అలాంటి పాత్రను మెయిన్ లీడ్ గా తీసుకుని కథ అల్లుకున్నాడు తేజ. కథనం ఏమాత్రం పెద్దగా ఆసక్తిలేని మలుపులతో సాగుతూ బోర్ కొడుతుంది.
విశ్లేషణ :
సీత అంటూ విమెన్ సెంట్రిక్ కథను తీసుకుని కాజల్ మెయిన్ లీడ్ గా పెట్టి దర్శకుడు తేజ చేసిన ఈ ప్రయత్నం పెద్దగా ఆకట్టుకోదు. కథలో ఎక్కడా మలుపులు కానీ, ట్విస్ట్ గాని లేవు. నెక్స్ట్ ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఇట్టే ఊహించగలడు. ఇక హీరోగా నిలదొక్కునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ని ఈ పాత్రలో ఊహించుకోవడం కష్టం. కొంచెం కామెడీ ఉన్నప్పటికీ హీరో పాత్రకు ఏమాత్రం ప్రాముఖ్యత లేకపోవడం బోర్ కొడుతుంది. ఇక కథలో చాలా లాజిక్స్ మిస్సయ్యాయి. ఒక్క సాంగ్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. తేజ నుండి ఇలాంటి సినిమాలు ఎవ్వ రూ ఊహించరు. మొత్తానికి సీత అంటూ తేజ చేసిన ప్రయత్నం పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు.
ట్యాగ్ లైన్ : బోర్ కొట్టించింది