నైరుతి రుతుపవనాలు జూన్ 1 లేదా 2 న రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. ఆ సమయంలో పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉన్నట్లు పేర్కొంది. అదే సమయంలో మరి కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
గురువారం అత్యధికంగా ప్రకాశం జిల్లా పామూరులో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.7, తిరుపతి జిల్లా రేణిగుంటలో 44.6 డిగ్రీలు నమోదు అయ్యాయి. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరో 145 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని చెప్పింది. గురువారం ఎండవేడికి తట్టుకోలేక పార్వతీపురం మన్యం జిల్లాలో ముగ్గురు, ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల పరిధిలో ఒకరు మృతిచెందారు.