ప్రముఖ నటుడు, దర్శకుడు దాసరి నారాయణ రావు మరణం తరువాత అయన ఆస్తుల విషయంలో పలు వివాదాలు రేకెత్తిన విషయం తెలిసిందే. దాసరి ఆస్తులపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తూ వివాదాలకు తావిస్తున్నారు. అయితే దాసరి ఆస్తుల పంపకాల విషయంలో నటుడు మోహన్ బాబు స్పందించాడు. మోహన్ బాబు, దాసరి ల మధ్య ఎలాంటి అనుబంధం ఉండేదో అందరికి తెలుసు. తాజాగా దాసరి టాలెంట్ అకాడమీ 2019 ఏడాదికి గాను షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహించగా, అందులో విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమానికి ముఖ్య అథితిగా వచ్చిన మోహన్ బాబు ఈ వేదికపై స్పందించారు.
దాసరి గారి ఆస్తుల పంపకం విషయంలో తనను, మురళీమోహన్ ను ఎంతగానో నమ్మారని, వీలునామాలో పర్యవేక్షకులుగా మోహన్ బాబు, మురళి మోహన్ ల పేర్లు రాయించారని చెప్పారు. తన కుటుంబ సభ్యుల్లో ఎవరికీ అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో మా ఇద్దరి పేర్లు గురువుగారు రాయించారని పేర్కొన్నారు. అయితే తమ అసమర్థత కారణంగా దాసరి ఆస్తుల పంపకాలను సరిగ్గా నిర్వర్తించలేకపోయామని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేసారు. కొన్ని చేసాం, ఇంకొన్ని చేయాలేకపోయాం అని, అందుకు గల కారణాలు ఏమిటో నటి జయసుధకు తెలుసునని అయన అన్నారు.
అయితే తనవంతుగా గురువుగారికి ఎంతో చేసానని మోహన్ బాబు చెప్పారు. తిరుపతిలో దాసరి పేరుతొ 500 మంది విద్యార్థులు కూర్చునే విధంగా ఆడిటోరియం కట్టించానని, అది ఆసియాలోనే అత్యుత్తమమని వెల్లడించారు. దాసరి లేను లోటును ఎవరు భర్తీ చేయలేరని అయన అన్నారు. ఈ అవార్డుల వేడుకలో నటి జయసుధ తో పాటు తమ్మారెడ్డి భరద్వాజ, నారాయణమూర్తి, సి కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. మరి ఈ విషయంలో దాసరి కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.