Wayanad: కేరళలోని ఎప్పుడూ పచ్చని ప్రకృతితో కళకళలాడే వయనాడ్ అదే ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడిపోయింది. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మట్టిదిబ్బల్లో కూరుకుపోయి వందలాదిమంది మృత్యువాత పడ్డారు. దేశం మొత్తం వయనాడ్ ఘటనపై విచారం వ్యక్తం చేస్తోంది. ఈక్రమంలో మలయాళ హీరో మోహన్ లాల్ ప్రమాద ప్రాంతం సహాయం చేసేందుకు రంగంలోకి దిగడం విశేషం.
టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా మోహన్ లాల్ ఉన్నారు. దీంతో ఆయన ప్రమాద ప్రాంతంలో సహాయ సహకారాలు అందిస్తున్న సైనికులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కోజికోడ్ నుంచి వయనాడ్ కు రోడ్డు మార్గాన వెళ్లి విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నారు.
వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు దేశం మొత్తం కదులుతోంది. సినీ ప్రముఖులు సూర్య, జ్యోతిక, కార్తీ కలిసి 50లక్షలు, కమల్ హాసన్ 25లక్షలు విరాళం అందించారు. మరోవైపు వందల్లో గల్లంతైన వారి కోసం డ్రోన్లు, రాడార్లు, మొబైల్ సిగ్నల్స్ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి.