‘‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. ప్రజల భవిష్యత్తు కాపాడే నాయకుడు మోదీ అని, ఆయన జీఎస్టీ సంస్కరణలతో దేశ ప్రజలందరూ లాభం పొందారని చెప్పారు. శ్రీశైలం శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకేచోట ఉన్న పవిత్ర నేల అని, ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పుట్టిన వీరభూమిలో ఈ సభ జరగడం గర్వకారణమన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘సూపర్ సేవింగ్స్’’ కార్యక్రమం ప్రారంభం మాత్రమే, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజాప్రయోజన పథకాలు వస్తాయని తెలిపారు. మోదీ 25 ఏళ్లుగా ప్రజా సేవలో సీఎం, ప్రధానిగా ఉన్నారని గుర్తుచేశారు. సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు దొరకడం దేశానికి అదృష్టమన్నారు.
‘‘నేను చాలా మంది ప్రధానులతో పనిచేశాను, కానీ మోదీ లాంటి దృఢ సంకల్పం, క్రమశిక్షణ కలిగిన నాయకుడిని చూడలేదు’’ అని చంద్రబాబు అన్నారు. ఎలాంటి విశ్రాంతి లేకుండా నిరంతరం దేశ అభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు.
భారతదేశం 2047 నాటికి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తుందని, మోదీ సంకల్పం వల్లే 11వ స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరామని చెప్పారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ మన సైనిక బలం, ధైర్యాన్ని నిరూపించిందని చంద్రబాబు అన్నారు.
జీఎస్టీ సంస్కరణలతో 99 శాతం వస్తువులు 5 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయని, ఈ మార్పులతో ‘‘బచత్ ఉత్సవ్’’ భరోసా ఉత్సవంగా మారిందని పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్‌కి డబుల్ బెనిఫిట్ వస్తుందని, ప్రజల సంక్షేమం కోసం కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తున్నాయని చంద్రబాబు నాయుడు తెలిపారు.
