Graduates: వైసీపీలో ముసలం బయల్దేరింది. ముసలం అనాలా.? కుదుపు అనాలా.? ఆత్మపరిశీలన అనుకోవాలా.? ఈ విషయాలపై ముందు ముందు ఇంకాస్త స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీలో తీవ్ ప్రకంపనలకు కారణమవుతున్నాయి. వాస్తవానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్ని 2024 ఎన్నికలకు సంబంధించి ఓ ‘శాంపిల్ సర్వే’ అనుకోవచ్చు.! ఇది నిఖార్సయిన సర్వే. ఈ ఎన్నికలకు సంబంధించి రకరకాల అంశాలు కీలక పాత్ర పోషించి వుంటాయి. గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓటేసే అవకాశం వుంది ఈ ఎన్నికల్లో. అయితే, ఏడో తరగతి ఫెయిల్ అయినవారికీ వైసీపీ కొన్ని చోట్ల ఓటు హక్కు కల్పించి.. తమకు అనుకూలంగా ఓట్లేయించుకుంది. అలాంటి ఓట్లలో చాలావరకు చెల్లకుండా పోయాయి. అది వేరే సంగతి.
ఇంతకీ, ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లేసిన గ్రాడ్యుయేట్లు, గ్రామ స్థాయిలో తమ కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని ప్రభావితం చేయగలిగితే, వారిని చైతన్యవంతుల్ని చేయగలిగితే.? ఈ భయం వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. ‘వై నాట్ 175’ అంటోంది వైసీపీ.. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుందనీ, 17 లేదా 15.. ఇవేవీ కాకపోతే ఒకటి.. అన్నట్టు తయారైపోయింది. కేవలం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్ని బట్టి వైసీపీని అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అలాగని, ఎక్కువగా ఊహించుకోవడానికీ వీల్లేదు.
మార్పు సుస్పష్టం. 2024 ఎన్నికలు వైసీపీ అనుకుంటున్నట్లు జరిగే అవకాశమే లేదని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు తేల్చేశాయి. మూడు రాజధానుల పేరుతో నాటకం సహా, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, నిరుద్యోగ సమస్య.. చెప్పుకుంటూ పోతే, చాలా అంశాలున్నాయ్.. వైసీపీ పతనానికి.!
అబ్బే, అదేం లేదు.. ఆల్ ఈజ్ వెల్.. అని పేర్ని నాని లాంటోళ్ళు చెబుతున్న మాటల్ని వైసీపీ అధినాయకత్వం పరిగణనలోకి తీసుుకుంటే, 2024 ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.