Raghurama: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy), అప్పటి సీఐడీ డీజీ సునీల్ కుమార్, మాజీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులుపై గుంటూరులోని నగరంపాలెం పీఎస్ లో కేసు నమోదైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను రాజద్రోహం చట్టం పేరుతో వీరు అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు (Raghuramakrishna Raju) ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో.. కస్టడీకి తీసుకున్న సమయంలో పోలీసులు తనపై దాడి చేశారని.. రబ్బర్ బెల్ట్, లాఠీలతో కొట్టారని.. మే14, 2021న తనపై హత్యాయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు సునీల్ కుమార్ ఏ1, ఆంజనేయులు ఏ2, జగన్మోహన్ రెడ్డి ఏ3, అప్పటి సీఐడీ ఏఎస్పీ విజయ్ పాల్ ఏ4, గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఏ5పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీటిలో బెయిలబుల్, నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్నాయి.
నాడు రఘురామ వైసీపీ పార్టీతో విభేదించి దూరంగా ఉన్నారు. రఘురామ అరెస్టు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.