సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ఓ కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రత్యేక కానుక రాబోతోంది. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్‌ను జనవరి 16న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ అనౌన్స్‌మెంట్‌తోనే సినిమాపై ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది.
సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రమేష్ ఏగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రణధీర్ భీసు హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా హెబ్బా పటేల్ కనిపించనుండగా, ఆకాంక్ష మరో కీలక పాత్రలో నటిస్తోంది. కథకు బలం చేకూర్చే పాత్రల్లో సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ నటించడం విశేషం.
యాక్షన్‌తో పాటు భావోద్వేగాల మేళవింపుతో రూపొందుతున్న ఈ సినిమాను, ‘సత్య గ్యాంగ్’, ‘ఫైటర్ శివ’ వంటి చిత్రాలతో తనదైన శైలిని చూపించిన ప్రభాస్ నిమ్మల ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే పరంగా కొత్తదనం ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రంలో నరేష్ నాయుడు, జనార్దన్, యోగి కాత్రే, విజయ్ సూర్య, ఇంతియాజ్, సాయిబాబా, దిల్ రమేష్, ఝాన్సీ, సూర్యనారాయణ, శ్రీధర్, శ్రీకాంత్, శివ, ఆమని, హైమావతి, నవ్య (అమ్ము), బెజవాడ మస్తాన్, ధీరజ అప్పాజీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సాంకేతికంగా కూడా సినిమాకు మంచి బలమే ఉంది. సినిమాటోగ్రఫీని సురేందర్ రెడ్డి అందిస్తుండగా, ఎడిటింగ్ బాధ్యతలను విశ్వనాధ్ నిర్వహిస్తున్నారు. సంగీతాన్ని ప్రభాస్ అందించగా, పాటల రచనను రాంబాబు గోశాల చేశారు. యాక్షన్ సన్నివేశాలకు శ్రీను ఫైట్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పరంగా మంచి దశకు చేరుకున్న ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్ సంక్రాంతి సందర్భంగా విడుదల కావడంతో, ఈ సినిమా ఎలాంటి విజువల్ ట్రీట్ ఇవ్వబోతోందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. ఫస్ట్ లుక్‌తోనే సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి.
