చిత్తూరు జిల్లా మురకంబట్టు ప్రాంతంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో ముగ్గురు వ్యక్తులపై పోలీస్ కేసు నమోదు చేశారు. చిత్తూరు తాలూకా పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
సెప్టెంబర్ 25న నగరవనం పార్క్‌లో ఒంటరిగా ఉన్న ప్రేమజంటపై కొందరు వ్యక్తులు దాడి చేసి, విలువైన వస్తువులను దోచి గాయపరిచారు. ఈ ఘటనపై యువకుడు 29-09-2025న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు సమయంలో అతను… ముగ్గురు వ్యక్తులు తనను బెదిరించి, మైనర్ బాలికపై అత్యాచారం చేశారని చెప్పాడు.
పోలీసులు వెంటనే బాధితురాలిని కౌన్సిలింగ్ ద్వారా ముందుకు తీసుకువచ్చి, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వన్ స్టాప్ సెంటర్‌లో మహిళా అధికారి ద్వారా స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. బాధితురాలి వివరాలు సేకరించి, ఆమె తల్లిదండ్రులతో చర్చించారు.
దర్యాప్తు ఆధారంగా, చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో Cr.No.129/2025 కింద POCSO చట్టం, SC/ST అట్రాసిటీ చట్టం లోని వివిధ సెక్షన్లపై కేసు నమోదు చేయబడింది.
జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS ఆదేశాల మేరకు, సబ్-డివిజన్ డి.ఎస్.పి. శ్రీ టి. సాయినాథ్ గారి ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయబడి, పరారీలో ఉన్న నిందితులు — మహేష్, కిషోర్, హేమంత్ ప్రసాద్ —ను పట్టుకోవడానికి చర్యలు చేపట్టారు. త్వరితగతిన నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటించారు.
పోలీసులు ఈ కేసులో పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాధితురాలిని సంబంధించిన వివరాలను మీడియా లేదా సోషల్ మీడియాలో వెల్లడించకూడదని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
చిత్తూరు పోలీసులు అసత్య వార్తలు లేదా వదంతులను వ్యాప్తి చేయకుండా ఉండమని ప్రజలకు పిలుపునిచ్చారు.
