క్యాబినెట్ సమావేశం ప్రారంభానికి ముందు పలు మంది మంత్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి తమ నియోజకవర్గాల రహదారి నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం కాలంలో గ్రామీణ ప్రాంతాల రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్న కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు పునర్నిర్మాణ పనులు ప్రారంభం అవుతుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారని మంత్రులు పవన్ కళ్యాణ్‌గారికి వివరించారు. తమ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వారు అన్నారు.
పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, నారాయణ, నాదెండ్ల మనోహర్, సవిత, డి.వి.బి. స్వామి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ వంటి కీలక మంత్రులు పవన్ కళ్యాణ్‌ను కలిసి అభినందనలు తెలిపారు. గ్రామీణ రహదారి అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని వారు పేర్కొన్నారు.
ఇప్పటికే పంచాయతీ రాజ్ శాఖ మొదటి విడతగా రహదారి పటిష్టత పనులకు సంబంధించిన జీవోను జారీ చేసింది. మొత్తం 157 నియోజకవర్గాల్లో 1299 రోడ్ల అభివృద్ధి చేపట్టబడుతోంది. ఇందుకోసం రూ.2123 కోట్ల సాస్కీ నిధులను విడుదల చేస్తూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 26 జిల్లాల్లోని 157 నియోజకవర్గాలకు చెందిన 4007 కిలోమీటర్ల రహదారులను పటిష్టపరచే దిశగా కార్యాచరణ వేగవంతమైంది.
‘పల్లె పండుగ 2.0’ పేరిట గ్రామీణ రహదారి నిర్మాణాలను ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తోంది. ఈ ప్రాజెక్ట్‌లకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల శంకుస్థాపన చేయడం గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొత్త ఊపునిచ్చింది.



