మంత్రి నారా లోకేష్ చొరవతో మరో ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ లోకి గూగుల్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఏఐ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏపీ యువతను తీర్చిదిద్దేందుకు గూగుల్ ముందుకు వచ్చింది. ఇందుకోసం ప్రభుత్వంతో ప్రత్యేకంగా ఒప్పందం చేసుకుంది. ఏఐ రంగంలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఏపీ స్టూడెంట్లు, యువతకు కీలకమైన శిక్షణలు ఇచ్చేందుకు నారా లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఎపీ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ మధ్య కీలక అగ్రిమెంట్ జరిగింది.
ఏపీలోని స్కూళ్లు, కాలేజీల్లో స్టూడెంట్లకు ఏఐ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించనుంది గూగుల్. అలాగే స్టార్టప్ కంపెనీలు పెట్టాలనుకునే వారికి, చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వనుంది. హెల్త్, పర్యావరణం లాంటి విషయాల్లో కూడా ఏఐ సేవలను ప్రభుత్వానికి అందించబోతోంది. దీంతో ఏపీ పరిపాలనలో కూడా భారీ మార్పులు రాబోతున్నాయి. ఏఐ ద్వారా ఎన్ని రకాలుగా వీలుంటే అన్ని రకాలుగా సేవలందిస్తామని లలితా రమణి తెలిపారు.
ఇక నుంచి ఏపీలో అన్ని రకాల ప్రభుత్వ సేవలను డిజిటిలైజ్ చేయడమే తమ లక్ష్యం అన్నారు మంత్రి లోకేష్. ఈజ్ ఆఫ్ లివింగ్ విధానాన్ని పెంచుతామన్నారు. గూగుల్ సాయంతో యువతకు కావాల్సిన అన్ని రకాల స్కిల్స్ పెంచుతామని.. తద్వారా యువతకు భారీగా ఉద్యోగాలు కల్పించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.