సీఎం చంద్రబాబు చెప్పిన పి4 విధానానికి రిలయన్స్ సిబిజి ప్లాంట్స్ నాంది కానున్నాయి.. రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడంలో ఇదొక ముఖ్యమైన అడుగు కాబోతుందని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పిసిపల్లి మండలం దివాకరపురంలో రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కు మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేశారు.
నీటి వసతి లేని మెట్ట ప్రాంతంలో రైతులకు ఈ ప్లాంట్స్ ద్వారా పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని అన్నారు. ఇక్కడ నైపర్ గడ్డితో గ్యాస్ తయారు చేయబోతున్నారు. ప్రభుత్వ భూములకు 15 వేలు, రైతుల భూములకు 31 వేల కౌలు కూడా ఇవ్వబోతున్నారని అన్నారు. రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేసే సిబిజి ప్లాంట్లన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తే ఏటా 110 లక్షల మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువు తయారవుతుంది. ఈ ప్లాంట్ల ద్వారా గ్రామీణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయని అన్నారు నారా లోకేష్.
ప్రకాశం జిల్లా వచ్చిన ప్రతిసారి మీరు చూపించే ప్రేమ, ఆప్యాయత మర్చిపోలేనని.. ప్రకాశం జిల్లాలో పేదరికం లేకుండా చేయడమే మా లక్ష్యమని అన్నారు నారా లోకేష్. ఆధ్రప్రదేశ్ లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ కి రిలయన్స్ 65 వేల కోట్ల పెట్టుబడి పెడుతుంది. దీని ద్వారా 500 ప్లాంట్లు పెట్టడానికి రిలయన్స్ ముందుకొచ్చింది. దీని వల్ల 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కడప లో 5 లక్షల ఎకరాల భీడు భూమిని ఇందుకు వినియోగిస్తున్నామని అన్నారు నారా లోకేష్.
ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆనం రామ్ నారాయణ రెడ్డి, చీఫ్ సెక్రటరీ విజయానంద్, ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి, అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ఏలూరి సాంబశివరావు, కాకర్ల సురేష్, ఇంటూరి నాగేశ్వర రావు పాల్గొన్నారు.
