భారత్ ను అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో వరల్డ్ ఆడియో అండ్ విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)ని నిర్వహించే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో ఇండియన్ సినీ, పారిశ్రామిక ప్రముఖులందరితో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వేవ్స్ లో సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, ముఖేష్ అంబానీ, ఆనంద్ మహేంద్రాతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, మోహన్ లాల్, రజినీకాంత్, అమీర్ ఖా, అక్షయ్ కపూర్, రణ్ బీర్ కపూర్, ఏ.ఆర్ రెహమాన్ కూడా ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవిని వేవ్స్ అడ్వైజరీ బోర్డులో భాగం చేశారు. వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఆర్ధిక రంగం కోసం దావోస్ ని ఎలా ఎంపిక చేసిందో.. వినోద పరిశ్రమ కోసం అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సుగా వేవ్స్ ని రూపొందించాలని కేంద్రం ప్లాన్ చేస్తుంది. వినోద, సృజనాత్మకత, సంస్కృతిలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని అంటున్నారు.
వేవ్స్ లో మెంబర్ అయినందుకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. వేవ్స్ అడ్వైజరీ బోర్డ్ లో భాగం కావడం మిగతా గౌరవనీయులైన సభ్యులతో నా ఆలోచలను పంచుకోవడం ఆనందంగా ఉందని అన్నారు చిరంజీవి. త్వరలో జరగనున్న అద్భుతాల కోసం మనమంతా ఎదురుచూస్తుండాలని అన్నారు చిరంజీవి.
అంతేకాదు ఈ మీటింగ్ పై ప్రధాని మోదీ స్పందించారు.. వినోద, సృజనాత్మకత, సంస్కృతి ప్రపంచాన్ని ఒకచోట చేర్చే వేవ్స్ అడ్వైజరీ బోర్డ్ సమావేశం ముగిసింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ మద్ధతు తెలియచేయడమే కాకుండా భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చడానికి కావాల్సిన సూచనలు, సలహాలు అందించారని ప్రధాని మోదీ అన్నారు.