Chiranjeevi: ఎంత చెప్పుకున్నా.. ఎంతెంత చదివినా.. మరెంత తెలుసుకున్నా.. చిరంజీవి జీవితం నిత్యనూతనం. సినీ ప్రస్థానం, సమాజ సేవలో సాధించిన విజయాలు, సంపాదించిన కీర్తి, అందుకున్న పురస్కారాలు ఇందుకు నిదర్శనం. జీవిత సాఫల్య పురస్కారాలు, నంది అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు, గౌరవ డాక్టరేట్, గిన్నీస్ వరల్డ్ రికార్డు, భారతదేశ రెండు, మూడో అత్యున్నత పౌర పురస్కారాలు పద్మభూషణ్, పద్మవిభూషణ్ అందుకున్నా ఆయనలో ఇప్పటికీ ఉన్నది తొలిరోజు కెమెరా ముందు నుంచున్న చిరంజీవి మాత్రమే.
అంతటి మహోన్నత వ్యక్తికి పురస్కారాల ప్రవాహం ఆగుతుందా..! రాష్ట్ర, జాతీయ స్థాయిలో మెరిసి మురిపించిన కొణిదెల చిరంజీవికి ఇప్పుడు అంతర్జాతీయ కీర్తి దక్కింది. హౌస్ ఆఫ్ కామన్స్ యునైటెడ్ కింగ్ డమ్ పార్లమెంట్ జీవిత సాఫల్య పురస్కారంతో గౌరవించింది. ఎంత శ్రమిస్తే, కష్టపడితే, సినిమాపై ఇష్టం, సమాజంపై ప్రేమ ఉంటే ఇవన్నీ ఓ వ్యక్తి సాధించగలడు. చిరంజీవి అదే చేసి చూపించారు. ఎంచుకున్న రంగంలో ఎదురుదెబ్బలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తే ముళ్ళబాట కూడా పూలబాట అవుతుందని నిరూపించారు.
ఇప్పుడు విదేశీగడ్డపై యూకే పార్లమెంట్ ఆయన్ను సత్కరించడం అయన సాధించిన మరో కిరీటం. నటనతో మెప్పించినా.. డ్యాన్స్ తో సమ్మోహనపరచినా.. ఫైట్స్ లో కష్టపడినా.. సమాజ సేవలో భాగమైనా.. అంతా ఆయనలోని నిబద్ధత. అదే ఆయన్ను ఉత్సాహంగా నడిపించే ఇంధనం. అందుకే ఆయన మెగాస్టార్ చిరంజీవి. యూకే పార్లమెంట్ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న సందర్భంగా చిరంజీవిగారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ అల్ ది బెస్ట్ చెప్తోంది టీమ్ “తెలుగు బులెటిన్”.