‘మా ఇద్దరి లక్ష్యం ఒకటే. ప్రజారాజ్యం పార్టీని స్థాపించింది మార్పు కోసం. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతున్నదీ మార్పు కోసమే. సినిమాల్నీ, రాజకీయాల్నీ నేను బ్యాలెన్స్ చేయలేకపోయినా, నా తమ్ముడు రెండిటినీ బ్యాలెన్స్ చేయగలడు..’ అని పలు సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి చెబుతూ వచ్చారు.
‘మా దారులు వేర్వేరు కావొచ్చు.. ప్రజా సేవలో మా అంతిమ లక్ష్యం మాత్రమే ఒకటే..’ అని గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పిన చిరంజీవి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ‘జై’ కొట్టారు తాజాగా.
ఎన్నికల సమయంలో కూడా జనసేన పార్టీకి చిరంజీవి ‘జై’ కొట్టలేదు. కాకపోతే, తమ్ముడు రాజకీయంగా ఎదగాలనీ, ప్రజాసేవలో తనదైన ప్రత్యేకతను చాటుకోవాలనీ చిరంజీవి ఆకాంక్షిస్తూ ఎన్నికల సమయంలో ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అంతే కాదు, జనసేన పార్టీకి సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. అది కూడా, కౌలు రైతుల కోసం జనసేన చేస్తున్న సాయానికి ఉపయోగపడుతుందన్న కోణంలో.
తాజాగా ఓ సినీ వేడుకలో, ‘ప్రజారాజ్యం పార్టీనే జనసేన పార్టీగా రూపాంతం చెందింది..’ అని చిరంజీవి చేసిన ప్రకటన ఒక్కసారిగా తెలుగునాట రాజకీయాల్లో సంచలనంగా మారింది. మెగాభిమానులంతా ఇదే భావనతో మొదటి నుంచీ వున్నా, చిరంజీవి నోటి నుంచి వచ్చిన ఈ ప్రకటన సహజంగానే, రాజకీయ వర్గాల్లో పెను సంచలనానికి కారణమైంది.
‘చిరంజీవి ఎందుకు తన తమ్ముడి పార్టీ జనసేనని ఓన్ చేసుకోవడంలేదు.?’ అంటూ, జనసేన పార్టీ మీద కొందరు సెటైర్లు వేస్తూ వచ్చారు. అన్నయ్య పేరు చెప్పుకోవడానికి ఎందుకంత నామోషీ.. అని అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన రాజకీయ నాయకులూ వున్నారు.
అయితే అటు పవన్ కళ్యాణ్, ఇటు చిరంజీవి.. ఇద్దరూ ఇప్పటిదాకా వ్యూహాత్మక మౌనం పాటిస్తూనే వచ్చారు.. ప్రత్యర్తుల విమర్శలకు సంబంధించి. తమ్ముడికి అన్నయ్య ఆశీస్సులు, అన్నయ్య పట్ల తమ్ముడికి వున్న ప్రేమాభిమానాలు.. ఇవన్నీ ప్రతిసారీ చాటుకోవాల్సిన అవసరమే లేదు.
ఏదిఏమైనా, చిరంజీవి ప్రకటన.. నిజంగానే చాలా చాలా పెద్ద స్టేట్మెంట్.. అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.