రాజకీయాలకు తాను పూర్తిగా దూరంగా ఉన్నానని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కృష్ణా జిల్లా డోకిపర్రులో ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి ఇంట్లో జరుగి గోదాదేవి కల్యాణోత్సవానికి చిరంజీవి హాజరయ్యారు.
ఈక్రమంలో హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చిరంజీవిని రాజ్యసభ సీటు వార్తలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ‘నాకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసారన్న వార్తలు ఊహాజనితం. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న నాకు అలాంటి ఆఫర్లు రావు.. వాటిని కోరుకోను కూడా. పదవులు కోరుకోవడం నా అభిమతం కాదు. ఇకపై ఇలాంటి వాటికి సమాధానం చెప్పను’ అని తేల్చి చెప్పారు.
సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న సమస్యలపై చర్చించేందుకు నిన్న సీఎం జగన్ మోహన్ రెడ్డిని చిరంజీవి కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారనే వార్తలు వచ్చాయి.