ఈమధ్య వచ్చిన ఒక సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక డైలాగ్ చెబుతారు. “నా పేరు రికార్డులో ఉండటం కాదు నా పేరు మీదే రికార్డులు ఉన్నాయి” అని.. అది నిజం.అదే నిజం. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ.. జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అన్నకు తగ్గ తమ్ముడని అనిపించుకుంటున్నారు. ఒకరు నటనలో గిన్నిస్ రికార్డు సంపాదిస్తే.. మరొకరు పాలనలో ఆ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇద్దరూ గాంధేయవాదులే. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ప్రపంచ రికార్డులు చోటు సంపాదించడం అనేది చాలా అరుదైన విషయం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ పాలనలో దూసుకుపోతున్నారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయాలన్న ఉద్దేశంతో ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 13,326 చోట్ల గ్రామసభలను నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ప్రజల భాగస్వామ్యంతో ఒకే రోజున అన్ని సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ వెల్లడించింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన రికార్డు పత్రాన్ని ఈనెల 16న యూనియన్ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ కు అందించారు. ఈ ఘనత బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోపే అందుకోవడం విశేషం.
ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే.. మోస్ట్ ప్రొలిపిక్ ఫిలిం స్టార్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ యాక్టర్, డాన్సర్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. ఆయన నటించిన 156 చిత్రాల్లో.. 537 పాటలకు గాను 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ప్రతినిధి రిచర్డ్ స్టెన్నింగ్, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా మెగాస్టార్ ఈ అవార్డును అందుకున్నారు. అలా ఒకే నెలలో అన్నదమ్ములిద్దరూ ప్రపంచ రికార్డులను కైవసం చేసుకున్నారు.