‘తెలుగు సినిమాల్లో ఎన్టీఆర్ తర్వాత అంతటి మాస్ ఇమేజ్, స్టార్ డమ్ ఉన్న హీరో చిరంజీవి’ అనే మాట అక్షరసత్యం. అటు పాత తరానికి, నేటి తరానికి మధ్య వారధిలా చిరంజీవి ప్రస్థానం ఓ అద్భుతమనే చెప్పాలి. చిరంజీవి నుంచి డైనమిక్ హీరో, సుప్రీం హీరో, మెగాస్టార్ చిరంజీవిగా ఆయన సాధించిన కీర్తి తెలుగు సినిమాకే గర్వం. ఖైదీ తర్వాత సుప్రీం హీరోగా అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న వేళ చిరంజీవి ఇమేజ్ కు అంతకుమించి పేరు తెచ్చేలా నిర్మాత కెఎస్.రామారావు ఓ బిరుదు ఇచ్చారు. అదే ‘మెగాస్టార్’. అభిలాష, చాలెంజ్, రాక్షసుడు తర్వాత చిరంజీవితో సినిమాలో సుప్రీం హీరో స్థానంలో ‘మెగాస్టార్ చిరంజీవి’ అని టైటిల్ కార్డ్ వేసి మెగా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఆ సినిమా ‘మరణమృదంగం’.
డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో..
ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్ రచనల్లో అప్పటికి చిరంజీవి మూడు సినిమాలు చేశారు. ఆ హ్యాట్రిక్ హిట్లకు కొనసాగింపుగా మరణమృదంగం నాలుగో హిట్ దక్కించుకుంది. సినిమా డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరుగుతుంది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ గ్యాంగ్ అరాచకాలను ఓ క్యాసినో నడిపే జానీ అంతమొందించడమే ఈ కథ. నవలగా విజయవంతమైన కథ సినిమాగానూ విజయం సాధించింది. చిరంజీవి క్రేజ్ దృష్ట్యా పాటలు, ఫైట్లు, యాక్షన్ సన్నివేశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీంతో ఫ్యాన్స్, ప్రేక్షకులను సినిమా మెప్పించింది. సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతంలోని పాటలు హైలైట్ అని చెప్పాలి. తన మ్యాజిక్ తో అద్భుతమైన పాటలు ఇచ్చారు. చిరంజీవికి రాధతో హిట్ కాంబినేషన్ అని మరోసారి ప్రూవ్ అయింది.
మెగా అభిమానులకు ప్రత్యేకం..
మరణమృదంగం మెగా ఫ్యాన్స్ కు ప్రత్యేకం. చిరంజీవితోపాటు ఆయన కుటుంబ హీరోలకు, కుటుంబానికి కూడా టాలీవుడ్ లో ‘మెగా’ అనే ట్యాగ్ రావడానికి బీజం వేయడమే కారణం. అందుకే మెగా ఫ్యాన్స్ సినిమా రిలీజ్ అయిన ఆగష్టు 4ను ‘చిరంజీవి మెగాస్టార్ గా మారిన రోజు’గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇండియాలో సూపర్ స్టార్ ట్యాగ్స్ ఉన్నాయి కానీ.. ‘మెగాస్టార్’ అనే ట్యాగ్ ఒక్క చిరంజీవికి మాత్రమే ఉండటం విశేషం. లక్కీ ప్రొడ్యూసర్ కెఎస్.రామారావు తన క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై చిరంజీవి లక్కీ డైరక్టర్ ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను భారీగా నిర్మించారు. నాగబాబు, రాధ, సుహాసినీ ప్రధాన పాత్రల్లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా సినిమా తెరకెక్కిన మరణమృదంగం శతదినోత్సవ సినిమాగా నిలిచింది.